Kamal Haasan: మేము అధికారంలోకి వస్తే.. తమిళనాడుకు రెండో రాజధానిగా మదురై: కమలహాసన్ సంచలన ప్రకటన

Kamal Hasan Says Madurai is the Second Capital
  • ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కమల్
  • సభలకు అనుమతి ఇవ్వని పోలీసులు
  • త్వరలోనే థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుందన్న కమల్

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తన పార్టీ విజయం సాధిస్తే, రాష్ట్రానికి రెండో రాజధానిగా మధురై ఉంటుందని మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత, నటుడు కమలహాసన్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం నాడు మదురై కేంద్రంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన, ఆపై బహిరంగ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్ షోను ప్రారంభించి, తేని, దిండుగల్ వైపు బయలు దేరారు. ప్రైవేటు స్థలాల్లో పలు వర్గాలతో చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆయన, మీడియాతో మాట్లాడారు.

తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్న విషయాన్ని అతి త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్న ఆయన, త్వరలోనే థర్డ్ ఫ్రంట్ కు ఓ రూపాన్ని ఇస్తామని తెలిపారు. తన సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, నిబంధనలకు కట్టుబడే ప్రచారం సాగిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందించడమే తన లక్ష్యమని తెలిపారు.

రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ప్రశ్నించగా, ఆయన్నుంచి ఎటువంటి ప్రకటన వస్తుందో వేచి చూస్తున్నానని, ఆపై తప్పకుండా రజనీని కలుస్తానని అన్నారు. పాలనలో మార్పు తీసుకురావాలన్న నినాదంతో తన పార్టీ ముందడుగు వేస్తుందని కమల్ స్పష్టం చేశారు. కాగా, మక్కల్ నీది మయ్యమ్ పార్టీతో ఎంఐఎం ఎన్నికల పొత్తును పెట్టుకుంటుందన్న వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News