Sunil Gavaskar: జాగ్రత్త.. మరిన్ని బౌన్సర్లు పడతాయి: పుకో విస్కీని హెచ్చరించిన సునీల్ గవాస్కర్

Sunil Gavaskar Warns Australia Younge Cricketer Pukovski
  • 17 నుంచి ఆసీస్ తో తొలి టెస్ట్
  • కంగారూల జట్టుకు ఎంపికైన యువ ప్లేయర్ పుకో విస్కీ
  • ఇండియాతో జరిగిన మ్యాచ్ లో గాయం
  • షమీ బౌన్సర్లను కాచుకోవాల్సి వుంటుందన్న గవాస్కర్
అతి త్వరలో ప్రారంభం కానున్న భారత్ - ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత కామెంటేటర్ సునీల్ గవాస్కర్, యువ ఆసీస్ ఆటగాడు విల్ పుకోవిస్కీపై సెటైర్లు వేశారు. టెస్ట్ సిరీస్ కు డేవిడ్ వార్నర్ స్థానంలో పుకో విస్కీని ఆసీస్ ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో భారత జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో త్యాగి వేసిన బాల్ బౌన్స్ కాగా, పుకోవిస్కీ హెల్మెట్ ను అది తాకింది. ఆ వెంటనే అతను ఫిజియో సలహాపై రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన సునీల్ గవాస్కర్, పుకోవిస్కీని భయపెట్టే ప్రయత్నం చేశాడు. విస్కీకి తగిలిన గాయం అంత ప్రమాదకరం కాదని మెడికల్ టీమ్ తేల్చడంతో, 17 నుంచి ఆరంభం కానున్న తొలి టెస్టులో అతను ఆడతాడని ఆసీస్ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో స్పందించిన గవాస్కర్, "ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ విషయాన్ని నేను ముందుగానే ఊహించాను. ఆస్ట్రేలియాలో పిచ్ లు పేసర్లకు ఎంతో అనుకూలిస్తాయి. ఎవరైనా మైదానంలోకి దిగితే బౌన్సర్లను ఎదుర్కోవాల్సిందే. ఒకవేళ టెస్ట్ మ్యాచ్ లో పుకోవిస్కీ ఆడితే మరిన్ని బౌన్సర్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మా మహమ్మద్ షమీ బౌన్సర్లు వేయడంలో దిట్ట. ఇప్పటికే బ్యాట్స్ మెన్లను ఇబ్బంది పెట్టే బౌన్సర్లు ఎన్నో వేశాడు. విస్కీ ఎలా స్పందిస్తాడో మరి" అని అన్నారు.

కాగా, ఈ నెల 17 నుంచి ఆసీస్ తో తొలి టెస్ట్ అడిలైడ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇండియాకు తిరిగి రానున్నాడు. ఆపై టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అంటున్నా, ఇంతవరకూ స్పష్టత లేదు. ఇప్పటికిప్పుడు రోహిత్ ఆస్ట్రేలియా చేరినా, క్వారంటైన్ అనంతరం మూడవ టెస్ట్ కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి.
Sunil Gavaskar
Australia
India
Cricket
Test
Pukoviskey

More Telugu News