Jagan: ఏపీ తదుపరి సీఎస్.. ఆదిత్యనాథ్ దాస్ కే అవకాశం?

Jagan interested in Adityanath Das for next CS
  • ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న సీఎస్ నీలం సాహ్ని
  • తర్వాత సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ ను నియమించే యోచనలో సీఎం
  • 1987వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్
ఏపీ రాజకీయ, అధికార వర్గాల్లో కొత్త చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలం ఈ నెలఖరుతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. నీలం సాహ్ని తర్వాత సీనియారిటీలో ఆమె భర్త అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఎస్వీ ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు. వీరిలో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. అభయ్ త్రిపాఠి ఢిల్లీలోని ఏపీ భవన్ లో విధులు నిర్వహిస్తున్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సతీష్ చంద్ర ముఖ్యమంత్రి పేషీలో స్పెషల్ సెక్రటరీగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పట్ల జగన్ సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం. జేఎస్వీ ప్రసాద్ పై కూడా సీఎంకు ఆసక్తి లేదని చెపుతున్నారు. మరోవైపు నీరబ్ కుమార్ కు 2024 జూన్ వరకు సర్వీస్ ఉంది. ఆయనను సీఎస్ గా నియమిస్తే మిగిలిన కొందరు ఆ స్థానంలో పని చేసే అవకాశం కోల్పోతారనే యోచనలో జగన్ ఉన్నారు. దీంతో, ఆదిత్యనాథ్ దాస్ వైపు జగన్ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.

ఆదిత్యనాథ్ దాస్ ప్రస్తుతం జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఇప్పుడు ఆయనను సీఎస్ కార్యాలయంలో ఓఎస్డీగా నియమించనున్నట్టు సమాచారం. నెలాఖరు వరకు ఓఎస్డీగా ఉంటూ పాలనా వ్యవహారాలపై అవగాహన పెంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెలాఖరున నీలం సాహ్ని రిటైర్ అయిన వెంటనే కొత్త సీఎస్ గా ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. వచ్చే ఏడాది జూన్ లో దాస్ పదవీ విరమణ చేయనున్నారు. బీహార్ లో పుట్టిన ఆదిత్యనాథ్ 1987వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
Jagan
YSRCP
Adityanath Das
CS
Andhra Pradesh

More Telugu News