Telugu Couple: అమెరికాలో వెలుగుచూసిన హెచ్1బీ వీసా కుంభకోణం... పరారీలో తెలుగు దంపతులు

Lookout notices issued on Telugu Couple in visa fraud
  • తేలిగ్గా హెచ్1బీ వీసాలు వస్తాయంటూ విద్యార్థులకు వల
  • ఒక్కొక్కరి నుంచి 25 వేల డాలర్లు వసూలు
  • మొత్తం రూ.10 కోట్ల మేర వసూలు!
  • నిందితులపై లుకౌట్ నోటీసులు
  • యూరప్ పారిపోయినట్టు అనుమానం 
హెచ్1బీ వీసాలు ఇప్పిస్తామంటూ అనేకమంది విద్యార్థులను మోసం చేసిన ఘటనలో ఓ తెలుగు జంటపై అమెరికాలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ జంటపై అట్లాంటా పోలీసులకు ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి.

సునీల్, ప్రణీత అనే తెలుగు దంపతులు తమను తాము వీసా కన్సల్టెంట్లుగా పేర్కొని, అమెరికాలోని పలు యూనివర్సిటీలు, కాలేజీల్లో విద్యాభ్యాసం చేస్తున్న స్టూడెంట్లకు హెచ్1బీ వీసాలు వచ్చేలా చేస్తామని నమ్మబలికేవారు. ఆ విధంగా ఒక్కొక్క విద్యార్థి నుంచి 25 వేల డాలర్లు వసూలు చేసినట్టు గుర్తించారు. అనధికార లెక్కల ప్రకారం వారిద్దరూ సుమారు రూ.10 కోట్ల మేర విద్యార్థుల నుంచి వసూలు చేసి బిచాణా ఎత్తేశారు. దాంతో లబోదిబోమన్న విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు.

కాగా, ఈ సొమ్ములో ఒక కోటి రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న సునీల్ తండ్రి ముత్యాల సత్యనారాయణ పేరిట ఉన్న అకౌంట్ కు బదిలీ అయినట్టు అమెరికా అధికారులు గుర్తించారు. తమ మోసాలు బయటపడడంతో సునీల్, ప్రణీత అమెరికా నుంచి పారిపోయి ఏదైనా యూరప్ దేశంలో తలదాచుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.

అటు, ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటినుంచి సునీల్ తండ్రి సత్యనారాయణ కూడా పత్తా లేకుండా పోయారు. సునీల్, ప్రణీత దంపతులపై ఇంటర్ పోల్ అధికారులు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
Telugu Couple
Visa Fraud
Lookout Notices
Sunil
Praneetha
USA
West Godavari District
Andhra Pradesh
India

More Telugu News