Corona Virus: భార్య వద్ద 'భౌతిక దూరం' పాటించిన కొత్త పెళ్లికొడుకు.. లైంగిక సామర్థ్య పరీక్షలకు భార్య పట్టు!

Newly Wed Man Maintains Physical Distance From Wife
  • మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఘటన
  • పెళ్లయి నెలలు గడుస్తున్నా భార్యను తాకని భర్త
  • నపుంసకుడని భావించి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
  • కరోనా ఫోబియాతో బాధపడుతున్నట్టు గుర్తించిన కౌన్సెలర్లు
కరోనా మహమ్మారి మనుషులపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తోందో, పచ్చని సంసారాల్లో అగ్గి ఎలా రాజేస్తోందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. కరోనా ఫోబియా బారినపడిన ఓ కొత్త పెళ్లికొడుకు భార్య వద్ద కూడా భౌతిక దూరం పాటిస్తుండడంతో దానిని మరోలా అర్ధం చేసుకున్న భార్య అతడు సంసారానికి పనికిరాడన్న నిర్ధారణకు వచ్చేసింది. పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిందీ ఘటన.

భోపాల్‌కు చెందిన యువకుడికి ఈ ఏడాది జూన్ 29న వివాహమైంది. అప్పటి నుంచి భార్యకు దూరంగానే ఉంటూ వస్తున్నాడు. మాట్లాడేటప్పుడు కూడా భౌతిక దూరం పాటిస్తున్నాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన భార్య.. భర్త నపుంసకుడు కావడం వల్లే తనకు దూరంగా ఉంటున్నాడని అనుమానించింది. ఇక లాభం లేదని పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేకాదు, తన భర్త నపుంసకుడని, అతడి నుంచి తనకు భరణం ఇప్పించాల్సిందిగా కోరుతూ ఈ నెల 2న కోర్టుకెక్కింది.

పెళ్లయిన దగ్గరి నుంచి ఒక్కసారి కూడా తనను తాకలేదని, మాట్లాడేటప్పుడు కూడా ఆమడ దూరంలో ఉంటున్నాడని వాపోయింది. అత్తమామలు కూడా తనను వేధిస్తున్నారని ఆరోపించింది. దీంతో అతడికి కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించిన అధికారులు.. కౌన్సెలర్లను పంపించారు. ఈ సందర్భంగా అతడు చెప్పింది విని వారు షాక్‌కు గురయ్యారు. కరోనా భయంతోనే భార్యను తాకడం లేదని, అంతే తప్ప మరేమీ లేదని చెప్పాడు.

పెళ్లయిన వెంటనే తన భార్య కుటుంబంలో కొందరికి వైరస్ సోకిందని, తన భార్యకు కూడా కరోనా సోకే ఉంటుందని, కాకపోతే ఆమె శారీరకంగా ఫిట్‌గా ఉండడంతో లక్షణాలు బయటపడడం లేదని చెప్పడంతో వారు విస్తుపోయారు. చివరికి అతడు కరోనా ఫోబియాతో బాధపడుతున్నట్టు తేల్చారు. ఆ తర్వాత అతడికి నిర్వహించిన లైంగిక సామర్థ్య పరీక్షల్లో ఫిట్‌గా ఉన్నట్టు తేలడంతో భార్యకు ఆ విషయం చెప్పిన అధికారులు ఇద్దరినీ ఒక్కటి చేశారు.
Corona Virus
wife
Madhya Pradesh
Bhopal
Physical Distance

More Telugu News