Corona Virus: వారం వ్యవధిలో 70 లక్షల మందికి టీకా... ప్లాన్ రెడీ చేసిన తెలంగాణ

Telangana Plan of Vaccine Distribution is Ready
  • తొలుత డాక్టర్లు, పోలీసులు, కార్మికులు, జర్నలిస్టులకు
  • వయో వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి కూడా
  • అన్ని జిల్లా కేంద్రాల్లో వ్యాక్సిన్ నిల్వకు సరిపడా ఏర్పాట్లు
  • వెల్లడించిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ
10 వేల మంది ఏఎన్ఎంలు, నర్సులతో కూడిన టీమ్, ఒక్కొక్కరు రోజుకు 100 మందికి ఇంజక్షన్... వారం రోజుల వ్యవధి... 70 లక్షల మందిని కవర్ చేయాలని నిర్ణయం... ఇది తెలంగాణ ప్లాన్. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే, తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలను ఇవ్వడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని భావిస్తున్న తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, ఇప్పటికే టీకా డ్రైరన్, సాఫ్ట్ వేర్ లను సరిచూసుకుని, వ్యాక్సిన్ రాక కోసం ఎదురుచూస్తోంది.

కేంద్రం నుంచి రాష్ట్రానికి టీకాలు రాగానే, తొలి దశలో 70 లక్షల మందికి వారం రోజుల వ్యవధిలోనే ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందులో సుమారు 3 లక్షల మంది వరకూ ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం తదితర ఆరోగ్య సిబ్బంది ఉంటారు. వీరితో పాటు పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులు, ఇతర కార్మికులు, వయో వృద్ధులు ఇతర అనారోగ్య సమస్యలున్నవారికి టీకాను ఇస్తారు.

అయితే, టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయమై కేంద్రం నుంచి ఇంతవరకూ సమాచారం రాలేదని, అయినా, తాము సిద్ధంగా ఉండి అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక ఫ్రిజ్ లను సిద్ధం చేశామని, మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 70 లక్షల మందికి సరిపడేంత వ్యాక్సిన్ ను దాచే వ్యవస్థ తెలంగాణకుందని అధికారులు వెల్లడించారు. ఇక వ్యాక్సిన్ పక్కదారి పట్టకుండా ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశామని, రెండు డోస్ ల టీకా తీసుకోవాల్సి వుంటుందని, శరీరంలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు తయారయ్యేందుకు కూడా సమయం పడుతుందని, వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా మాస్క్ ధరించే ఉండాలని అధికారులు సూచించారు.
Corona Virus
Vaccine
Telangana
Preparations

More Telugu News