Chandrababu: ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గిఫ్ట్ ఇది: చంద్రబాబు

Chandrababu press meet at Mangalagiri TDP office
  • మోటార్లకు మీటర్లు పెట్టడంపై చంద్రబాబు ధ్వజం
  • రైతు మెడకు ఉరేస్తున్నారని ఆగ్రహం
  • ఫేక్ ముఖ్యమంత్రి అంటూ మరోసారి వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులపై భారం వేయడానికి మోటార్లకు మీటర్లు పెడతారా... ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 "ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రైతులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ ఇది. రైతులు సాధించుకున్న హక్కు ఇది. అలాంటి రైతుల హక్కులను దెబ్బతీసే విధంగా మీటర్లు పెడుతూ, డబ్బులు ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతారా? ఎక్కడిచ్చారు డబ్బులు? అని నిలదీశారు.

"మీరేమైనా మాటమీద నిలబడ్డారా... మీరొక ఫేక్ ముఖ్యమంత్రి. రైతుకు మరణశాసనం ఇది. రైతు మెడకు ఉరేయడమే. డబ్బులు కట్టకపోతే కరెంటు తొలగిస్తారు. ఎక్కడా పన్నులు వేయబోమని ఎన్నికల వేళ చెప్పారు... కానీ ఇప్పుడు ఎన్ని పన్నులు పెంచారు. నాడు ఎన్నో హామీలు ఇచ్చారు. రైతుల అంశమే ఉదాహరణగా తీసుకుంటే రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పి, రూ.7,500 ఇస్తారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలను కలిపి దాన్ని మీ ఘనతగా చెప్పుకుంటే ప్రజలేమైనా అమాయకులనుకుంటున్నారా? కేంద్రం చూస్తూ ఊరుకుంటుందని అనుకుంటున్నారా?" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
Chandrababu
Jagan
Telugudesam
NT Ramarao
Farmers
Meters

More Telugu News