Farmers: రైతుల ఆత్మాభిమానం... ప్రభుత్వంతో చర్చల్లోనూ తమ ఆహారం తామే తెచ్చుకున్న వైనం!

Farmers brought their own food
  • వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతుల నిరసనలు
  • రైతులతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం
  • లంచ్ బ్రేక్ లో రైతులకు కూడా భోజన ఏర్పాట్లు
  • అధికారుల ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన రైతులు
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు గత కొన్నిరోజులుగా ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ కూడా రైతులతో చర్చలు కొనసాగించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ఈ చర్చలకు వేదికగా నిలుస్తోంది. అయితే ఈ సందర్భంగా ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. రైతుల ఆత్మాభిమానాన్ని తెలిపే ఘటన ఇది.

రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన నేటి సమావేశానికి ముగ్గురు కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు. దాంతో విజ్ఞాన్ భవన్ లో ఆహార ఏర్పాట్లు భారీగానే చేశారు. కాగా, మధ్యాహ్న భోజనం చేసేందుకు చర్చలకు స్వల్ప విరామం ప్రకటించగా, భోజనం చేసేందుకు రావాలంటూ ప్రభుత్వ వర్గాలు రైతులను కోరాయి. కానీ, రైతులు ప్రభుత్వ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. మా తిండి మేం తెచ్చుకున్నాం అంటూ తమతో తెచ్చుకున్న పొట్లాలు విప్పి అక్కడే అధికారుల ముందే భోజనం చేశారు. కొందరు రైతులు నేలపైనే కూర్చుని భుజించారు.

దీనిపై రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వం తమకు ఆహార ఏర్పాట్లు చేశామని చెప్పిందని, అయితే మా భోజనం మేం తెచ్చుకున్నాం అని చెప్పామని, తాము ఆహారం  కాదు కదా, కనీసం ప్రభుత్వం నుంచి టీ కూడా తీసుకోలేదలుచుకోలేదని స్పష్టం చేశారు.
Farmers
Food
Lunch
Discussions
Government

More Telugu News