Vijayashanti: అతి తక్కువ ఓటింగ్ నమోదు కావడంపై విజయశాంతి ఆవేదన

Vijayashanthi response on less voting in GHMC elections
  • గ్రేటర్ ఎన్నికలను ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేసింది
  • హడావుడిగా రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళ్లడం కూడా కారణం
  • ఎందరో ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ నమోదు కావడంపై విజయశాంతి ఆదేదన వ్యక్తం చేశారు. పోలింగ్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రోజుల వ్యవధిలోనే ఎన్నికలకు వెళ్లడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణమనే విమర్శలు కూడా వస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ ద్వారా స్పందించారు.

'జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంత తక్కువ ఓటింగ్ నమోదు కావడం ఆవేదన కలిగిస్తున్నప్పటికీ... ఇందులో ప్రభుత్వం, ఎన్నికల సంఘం బాధ్యత ఎక్కువనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వరుస సెలవులు ఉన్నాయని తెలిసీ, ఎక్కువ మంది నగరంలో ఉండే అవకాశం లేదని తెలిసీ... ఈ సమయంలో ఎన్నికలు వచ్చేలా షెడ్యూల్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వమే వ్యూహాత్మకంగా పోలింగ్‌ను నిర్వీర్యం చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది.

దీనికి తోడు ఓటరు నమోదు, ఓటరు జాబితాల్లో తగిన మార్పు చేర్పులు, అవకతవకలుంటే పరిశీలించి సరిచేయడానికి కావలసిన సమయం ఇవ్వకుండానే హడావుడిగా కేవలం రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళ్ళడం కూడా ఈ పరిస్థితికి దారి తీసిందనే విమర్శను కొట్టిపారేయలేం. ముఖ్యంగా చాలా డివిజన్లలో ఉద్దేశ్యపూర్వకంగానే ఎందరో ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. నేటి ఎన్నికల్లో చాలా చోట్ల స్లిప్పులు ఉన్నప్పటికీ ఓటరు లిస్టులో తమ పేర్లు లేవంటూ అనేకమంది ఓటర్లు నిరాశతో వెనుదిరగడం చూస్తే ఈ ఆరోపణలు నిజమని నమ్మక తప్పడం లేదు. ఈ పరిస్థితి ఓటర్లను నిరాశకు గురిచేసి పోలింగ్ బూత్‌లకు రాకుండా చేసింది.

ఇది గాక, చాలా పోలింగ్ బూత్‌‌లలో కోవిడ్ సన్నద్ధత కనిపించలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇది కూడా ఓటర్లను భయపెట్టింది. మొత్తం మీద జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో టీఆర్ఎస్ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరించిందని అందరికీ స్పష్టమైంది' అని విజయశాంతి అన్నారు.
Vijayashanti
BJP
GHMC Elections

More Telugu News