Andhra Pradesh: లోకేశ్ పై బొత్స వ్యాఖ్యలతో గందరగోళం... రేపటికి వాయిదా పడిన మండలి

AP Legislative council adjourned for tomorrow
  • ఏ పంట ఎక్కడ పండుతుందో లోకేశ్ ఏంతెలుసన్న బొత్స
  • ట్రాక్టర్ ను బురదగుంటలోకి పోనిచ్చాడంటూ ఎద్దేవా
  • ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు

ఏపీ చట్టసభల సమావేశాల్లో తొలిరోజే వాడీవేడి దృశ్యాలు కనిపించాయి. అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహావేశాలతో ఊగిపోగా, మండలిలోనూ తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధాలు జరిగాయి. మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై విమర్శనాస్త్రాలు సంధించగా టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోకేశ్ కు ఏ పంట ఎక్కడ పండుతుందో తెలుసా అని బొత్స ఎద్దేవా చేశారు. తన ప్రశ్నకు లోకేశ్ సరైన జవాబు చెబితే తాను తల దించుకుని కూర్చుంటానని బొత్స సవాల్ చేశారు. ట్రాక్టర్ ఎక్కి ఫొటోలకు పోజులివ్వడం కాదు... ట్రాక్టర్ ను బురదగుంటలోకి పోనివ్వడం తప్ప ఏం తెలుసు?.. చివరికి ఆ ట్రాక్టర్ ను రైతులతో బయటికి తీయించారు అంటూ లోకేశ్ పై విరుచుకుపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు కూడా దీటుగా స్పందించడంతో మండలిలో గందరగోళం ఏర్పడింది. టీడీపీ సభ్యులు మంత్రి బొత్స వ్యాఖ్యల పట్ల ఆందోళనకు దిగారు. అటు వైసీపీ సభ్యులు కూడా చైర్మన్ పోడియం వద్దకు దూసుకువచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, మండలిని రేపటికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. దాంతో తీవ్ర వాగ్యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది.

  • Loading...

More Telugu News