Serum: మా పరువు తీస్తున్నారు... రూ. 100 కోట్లకు దావా వేస్తున్నాం: సీరమ్ ఇనిస్టిట్యూట్

Serum Files 100 Crores Defermition case on Volunteer
  • టీకా తీసుకున్న వలంటీర్ కు అనారోగ్యం
  • రూ. 5 కోట్లకు దావా వేసిన చెన్నై వ్యక్తి
  • తప్పుడు ఆరోపణలేనన్న సీరమ్
  • సంస్థ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని మండిపాటు
తమ పరువును తీసేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్న చెన్నైకి చెందిన వ్యక్తిపై రూ. 100 కోట్ల మేరకు దావా వేయనున్నట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారు చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొన్న ఓ వలంటీర్, టీకా తీసుకున్న తనకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. తనకు నరాల బలహీనత వచ్చిందని, జ్ఞాపక శక్తి కూడా పోయిందని, వెంటనే ట్రయల్స్, టీకా తయారీని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాదు... తనకు రూ. 5 కోట్లు పరిహారంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేశాడు.

ఈ ఆరోపణలపై స్పందించిన సీరమ్, దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. బాధితుడి ఆరోగ్యంపై తాము సానుభూతితో ఉన్నామని, అయితే, టీకాకు, అతని అనారోగ్యానికి ఎటువంటి సంబంధం లేదని, వైద్య బృందం ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ, అతను బహిరంగంగా విమర్శిస్తూ, తమ సంస్థ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది.

ఇక, చెన్నైకి చెందిన ఈ వలంటీర్ కు అక్టోబర్ 1న శ్రీరామచంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో టీకా వేశారు. తొలి 10 రోజులు ఎటువంటి దుష్ప్రభావాలూ రాలేదు. ఆపై తలనొప్పి, వాంతులు వచ్చాయి. దీంతో అక్టోబర్ 11న అతన్ని ఆసుపత్రిలో చేర్చగా, ఎవరినీ గుర్తించలేని, మాట్లాడలేని స్థితికి వెళ్లిపోయాడు. ఆపై అతని మెదడు కూడా దెబ్బతిందని ఈఈజీ పరీక్షల్లో వెల్లడైంది. దీంతో అతను రూ. 5 కోట్ల పరిహారాన్ని కోరుతూ దావా వేశాడు. వ్యాక్సిన్ కారణంగానే తనకు ఈ పరిస్థితి ఏర్పడిందని బాధితుడు చెబుతుండగా, టీకా సురక్షితమేనని, అతని అనారోగ్య సమస్య వేరే కారణాల వల్లే వచ్చిందని సీరమ్ చెబుతోంది.

Serum
Vaccine
Corona Virus
Side Effects

More Telugu News