Thotakura Maremma: ఇల్లు కోల్పోయి బస్ షెల్టర్ లో తలదాచుకుంటున్న ఏపీ మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ 

AP Fishermen Corporation Director Maremma lost her house
  • మత్స్యకార కార్పొరేషన్ లో కీలక పదవిలో ఉన్న మారెమ్మ
  • నివర్ తుపాను ధాటికి ఇల్లు కోల్పోయిన వైనం
  • ఇద్దరు కుమార్తెలతో రోడ్డునపడ్డ మారెమ్మ
తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన తోటకూర మారెమ్మ ఇటీవలే ఏపీ మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితురాలైంది. ఆమె మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కూడా. అయితే రాష్ట్రస్థాయి పదవిలో ఉన్న తోటకూర మారెమ్మ ఇల్లు కోల్పోయిన స్థితిలో ఓ బస్ షెల్టర్ లో తలదాచుకుంటున్న వైనం దయనీయం అని చెప్పాలి.

మారెమ్మ ఇల్లు నివర్ తుపాను ధాటికి సముద్రంలో కలిసిపోయింది. ముందుకు చొచ్చుకు వచ్చిన సముద్రపు అలలు మారెమ్మ ఇంటిని కబళించాయి. దాంతో ఆమె తన సామానును ఇతరుల ఇళ్లలో ఉంచి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఓ బస్ షెల్టర్ లో ఉంటోంది. మారెమ్మకు నలుగురు కూతుళ్లు కాగా, అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కుమార్తెలు పలు కారణాలతో తల్లి మారెమ్మ వద్దనే ఉంటున్నారు. నివర్ ప్రభావంతో గూడు చెదిరిన మారెమ్మ... దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

దీనిపై ఆమె మాట్లాడుతూ, తానంటే సీఎం జగన్ ఎంతో అభిమానం చూపిస్తారని, వైసీపీ ఏర్పడినప్పటి నుంచి పార్టీ కోసం ఎంతో శ్రమించానని వెల్లడించింది. ఇప్పుడు పేరుకు రాష్ట్రస్థాయి పదవిలో ఉన్నప్పటికీ, రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. సాయం చేయాలంటూ పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని మారెమ్మ వెల్లడించింది. బిడ్డ లాంటి సీఎం జగనే తనను ఆదుకోవాలని ఆ మత్స్యకార మహిళ కోరుతోంది.

మత్స్యకార వర్గంలో ఎంతోమంది ప్రముఖ నేతలు ఉన్నా, సీఎం జగన్ మారెమ్మను పిలిచి మరీ డైరెక్టర్ పదవి అప్పగించారు. జగన్ మెచ్చిన నేత ఇలా ఇల్లు కూడా లేక రోడ్డునపడడం కలచివేస్తోంది.
Thotakura Maremma
AP Fishermen Corporation Director
Uppada
East Godavari District
Jagan
YSRCP

More Telugu News