Donald Trump: ట్రంప్‌తో జాగ్రత్త.. రానున్న రెండు నెలలు చాలా కీలకం: మిత్ర దేశాలకు ఇరాన్ హెచ్చరిక

Be careful with Trump warns Iran
  • ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాతో ఉద్రిక్తతలు పెంచుకోవద్దు
  • ట్రంప్ రెచ్చిపోయే అవకాశం ఉంది
  • ట్రంప్ ఏ స్థాయి వరకైనా వెళ్లే ప్రమాదం ఉంది
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఇరాన్-యూఎస్ బంధాలు దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరాన్ పై అన్ని రకాల ఆంక్షలను విధించిన ట్రంప్... ఒకానొక సమయంలో యుద్ధం చేయడానికి కూడా రెడీ అయిపోయారు. యుద్ధ మేఘాలు  కమ్ముకున్న తర్వాత చివరి నిమిషంలో ట్రంప్ ఆగిపోయారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించడంతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి.

అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడంతో ఇరాన్ సంతోషంగా ఉంది. బైడెన్ యూఎస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను స్వీకరించడానికి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో... కొంత జాగ్రత్తగానే ఉండాలని ఇరాన్ భావిస్తోంది. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునే లోపల ట్రంప్ ఎలాంటి అఘాయిత్యానికైనా వెనుకాడడంటూ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అంతవరకు జాగ్రత్తగా ఉండాలని తన మిత్ర దేశాలకు కూడా సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాతో ఎవరూ ఉద్రిక్తతలు పెంచుకోవద్దని తెలిపింది. అమెరికాకు వ్యతిరేకంగా ఎవరైనా ఏ ప్రయత్నం చేసినా... ట్రంప్ రెచ్చిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ట్రంప్ ఏ స్థాయికైనా వెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలుపును స్వాగతిస్తున్నామని ఇరాన్ చెప్పింది. మరోవైపు ఇరాన్ రక్షణ మంత్రి హొస్సేన్ డెఘాన్ మాట్లాడుతూ, అమెరికాతో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని అన్నారు. అయితే అనవసరంగా కయ్యానికి కాలు దువ్వితే మాత్రం దీటుగా స్పందిస్తామని చెప్పారు. రానున్న రెండు నెలల సమయం చాలా కీలకమని అన్నారు. ఈ సమయంలో అనవసరంగా అమెరికా జోలికి ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు.
Donald Trump
USA
Iran
War

More Telugu News