MS Dhoni: 2 వేల కడక్ నాథ్ కోడిపిల్లల కోసం ఆర్డర్ బుక్ చేసిన ధోనీ

Teamindia former captain Dhoni orders Kadaknath chicks
  • మ్యాచ్ లు లేకపోవడంతో ఇతర కార్యక్రమాలపై ధోనీ దృష్టి
  • రాంచీలో ఆర్గానిక్ కోళ్ల ఫారం ఏర్పాటు చేసిన వైనం
  • కడక్ నాథ్ కోళ్లు కావాలని మధ్యప్రదేశ్ రైతును కోరిన ధోనీ
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మ్యాచ్ లు లేకపోతే తన ఫాంహౌస్ లోనే ఎక్కువగా గడుపుతుంటాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోనీ ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం, కోళ్ల పెంపకం చేపడుతున్నాడు. అందుకోసం ఆయన తాజాగా 2 వేల కడక్ నాథ్ కోడి పిల్లల కోసం ఆర్డర్ చేశారు.

కడక్ నాథ్ కోళ్లు మధ్యప్రదేశ్ లోని ఝబువా జిల్లాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి నల్లని కోళ్లు. వాటి రంగే కాదు వాటి రక్తం, మాంసం కూడా నల్లగానే ఉంటాయి. అయితే, వాటి మాంసం, గుడ్లలో సమృద్ధిగా పోషకవిలువలు ఉండడంతో వాటికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఈ క్రమంలో తన కోళ్ల ఫారంలోనూ కడక్ నాథ్ కోళ్లను పెంచాలని ధోనీ నిర్ణయించుకున్నాడు. దాంతో పెద్ద సంఖ్యలో కోడి పిల్లలు కావాలంటూ ఝబువాలోని వినోద్ మేండా అనే గిరిజన వ్యవసాయదారుడ్ని కోరాడు. త్వరలోనే ఈ కోళ్లు ఝభువా నుంచి రాంచీలోని ధోనీ ఆర్గానిక్ కోళ్ల ఫారానికి చేరుకోనున్నాయి.  

దీనిపై ఝబువా జిల్లాలోని కడక్ నాథ్ కోళ్ల పరిశోధన స్థానం డైరెక్టర్ ఐఎస్ తోమర్ మాట్లాడుతూ, కొందరు స్నేహితుల ద్వారా ధోనీ తనను కోళ్ల కోసం సంప్రదించాడని, అయితే కోళ్లను సరఫరా చేసేందుకు తనకు వీల్లేకపోవడంతో తాండ్లా ప్రాంతానికి చెందిన ఓ రైతును సంప్రదించాలని సూచించినట్టు వెల్లడించారు. ఎంతో రుచికరమైన మాంసానికి పెట్టింది పేరైన ఈ కడక్ నాథ్ కోళ్లకు భౌగోళిక గుర్తింపు ఉంది. వీటి మాంసం, గుడ్లలో కొవ్వు, కొలెస్ట్రాల్ లేకపోవడంతో నిపుణులు కూడా వీటిని సిఫారసు చేస్తున్నారు.
MS Dhoni
Kadakn ath Chickens
Jhabua
Madhya Pradesh
Ranchi

More Telugu News