Chiranjeevi: కరోనా, కాలం నాతో ఆడేసుకున్నాయి... అసలు నాకు కరోనాయే లేదు: చిరంజీవి వెల్లడి

Chiranjeevi tests Corona negetive
  • తనకు కరోనా అని ఇటీవల వెల్లడించిన చిరు
  • అది తప్పుడు కిట్ వల్ల వచ్చిన ఫలితం అని తాజాగా వెల్లడి
  • తాజాగా ఏ పరీక్ష చేయించుకున్నా నెగెటివ్ అనే వచ్చిందన్న చిరు
  • తన కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పిన వైనం
మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడ్డారన్న వార్త అందరినీ ఆందోళనకు గురిచేసింది. చిరంజీవి సైతం తనకు కరోనా పాజిటివ్ రావడం పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, తాజాగా ఆయన మరికొన్ని టెస్టులు చేయించుకోగా, ఆయనకు అసలు కరోనాయే సోకలేదన్న విషయం వెల్లడైంది. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. అసలేం జరిగింది వివరించారు. కాలం, కరోనా గత నాలుగు రోజులుగా తనను కన్ఫ్యూజ్ చేసి, తనతో ఆడేసుకున్నాయని చెప్పారు. ఆదివారం టెస్ట్ రిపోర్టులో పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే బేసిక్ మెడికేషన్ ను ప్రారంభించానని తెలిపారు. రెండు రోజులైనా తనలో ఎలాంటి లక్షణాలు లేకపోయేసరికి తనకే అనుమానం వచ్చిందని... దీంతో అపోలో ఆసుపత్రికి వెళ్లానని చెప్పారు.

డాక్టర్లు తనకు సీటీ స్కాన్ తీసి ఛాతీలో ఎలాంటి ట్రేసెస్ లేవని నిర్ధారణకు వచ్చారని అన్నారు. అక్కడ నెగెటివ్ అని ఫలితం వచ్చిన తర్వాత... మరోచోట నివృత్తి చేసుకుందామని టెనెట్ ల్యాబ్ లో మూడు రకాల కిట్స్ లతో టెస్ట్ చేయించుకున్నానని, అక్కడ కూడా నెగెటివ్ వచ్చిందని చెప్పారు. ఆదివారం తనకు పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిన చోట కూడా చివరగా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించానని... అక్కడ కూడా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్ట్ తప్పుడు కిట్ వల్ల వచ్చిందనే నిర్ధారణకు డాక్టర్లు వచ్చారని చెప్పారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు చెపుతున్నానని అన్నారు.
Chiranjeevi
Corona Virus
Tollywood

More Telugu News