Corona Virus: కరోనా నుంచి కోలుకున్నాక కూడా మానసిక సమస్యలు.. పరిశోధనలో వెల్లడి

corona effects after cure
  • గుర్తించిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు
  • నిద్రలేమి, కుంగుబాటు, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు
  • మళ్లీ ఆసుపత్రులకు వస్తోన్న రోగులు
  • చిత్తవైకల్యం, మెదడు పనిచేయకపోవడం వంటి సమస్యలు కూడా  
ప్రపంచ మానవాళిని వణికిస్తోన్న కరోనా గురించి జరుపుతోన్న పరిశోధనల్లో ఎన్నో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కరోనా బారిన పడితే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే వెల్లడైంది. కరోనా వైరస్ ఊపిరితిత్తులు, నరాల వ్యవస్థ, హృదయం వంటి వాటిపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు.

కరోనా వైరస్ మనిషి‌ మెదడుపై ప్రభావం చూపుతుందని, దీంతో నిద్రలేమి, కుంగుబాటు, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎదురవుతున్నాయని తేల్చారు. కరోనా బారిన పడి కోలుకున్న వారిలోనూ ఈ సమస్యలు కనపడుతున్నట్లు చెప్పారు. అమెరికాలోని పలు సంస్థలు కరోనా బారిన పడ్డ వారి రికార్డులను పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు.

కరోనా‌ సోకిన వారిలో 20 శాతం కంటే ఎక్కువ మందిలో మూడు నెలల్లో మానసిక సమస్యలు  బయటపడినట్టు  తేల్చారు. ఈ సమస్యలతోనే వారు ఆసుపత్రులకు చికిత్స కోసం వస్తున్నట్టు తెలిపారు. తాజాగా కుంగుబాటు, ఒత్తిళ్లు వంటి మానసిక సమస్యలు ఎదుర్కొంటోన్న వారికి ఇతరులతో పోల్చితే 65 శాతం కరోనా సోకే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు.

కరోనా వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని చివరకు చిత్తవైకల్యం, మెదడు సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యల బారిన కూడా పడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. కరోనా గురించి ఆందోళన, భయాల వల్ల ఇలాంటి మానసిక సమస్యలను కొందరు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అలాగే, కరోనా వల్ల కేంద్ర నాడీమండల వ్యవస్థపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుందని తెలిపారు.

కుంగుబాటుకు గురయ్యే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ కారణంగానే వారికి కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తమకు కరోనా సోకిందని కొందరు రోగులు ఆందోళన చెందారని తెలిపారు. కోలుకున్నాక కూడా తమకు మళ్లీ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయన్న ఆందోళనవారిలో కనపడిందని చెప్పారు.
Corona Virus
COVID19

More Telugu News