Tamil Nadu: తమిళనాడులో మళ్లీ తెరుచుకున్న ‘అమ్మ కేంటీన్లు’.. భోజనం చేసిన సీఎం

Tamil Nadu CM launches three mobile Amma Canteens in Chennai
  • అమ్మ కేంటీన్లను 2013లో ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి జయలలిత 
  • కొవిడ్ కారణంగా మూత
  • పేదలు ఆకలితో అలమటించకూడదన్న సీఎం

తమిళనాడులో ‘అమ్మ కేంటీన్లు’ మళ్లీ తెరుచుకున్నాయి. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో ముఖ్యమంత్రి పళనిస్వామి నిన్న మూడు మొబైల్ కేంటీన్లను ప్రారంభించారు. ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు అల్పాహారం అందించనున్నారు.

 ఇడ్లీ రూపాయికి, పొంగల్ ఐదు రూపాయలకు విక్రయించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు భోజనం పెడతారు. సాంబార్ అన్నం, లెమన్ రైస్, కరువెపిళ్లై అన్నాన్ని రూ. 5 చొప్పున విక్రయిస్తారు. పెరుగన్నం ధర మూడు రూపాయలు. అయితే, పార్శిళ్లు మాత్రం ఇవ్వరు.

ఈ మొబైల్ కేంటీన్లు భవన నిర్మాణ పనులు జరిగే ప్రాంతాల్లోనూ, రద్దీ ప్రాంతాల్లోనూ సేవలు అందించనున్నాయి. కేంటీన్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రులు, నేతలు అక్కడే భోజనం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే వీటిని తిరిగి ప్రారంభించినట్టు చెప్పారు. తొలి విడతలో మూడు ట్రక్కులే ప్రారంభించినప్పటికీ తర్వాతి దశలో మరో 50 వాహనాలను సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.  2013లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత వీటిని ప్రారంభించారు. కొవిడ్ కారణంగా వీటిని మూసివేశారు.

  • Loading...

More Telugu News