Nizamabad District: ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

corona positive woman delivered three babies
  • వివాహమై నాలుగేళ్లయినా కలగని సంతానం
  • ఐయూఐ ద్వారా గర్భం
  • శిశువులకు కరోనా సోకకుండా వైద్యుల జాగ్రత్తలు
నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో కొవిడ్ బాధితురాలు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఎడపల్లి మండలానికి చెందిన మహిళకు వివాహమై నాలుగేళ్లు అయింది. అయినా సంతానం కలగకపోవడంతో ఐయూఐ చికిత్స ద్వారా గర్భం దాల్చింది. ఇటీవల అనారోగ్యం బారినపడడంతో గత నెల 21 ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నారు. అక్కడ వైద్యులు ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అప్పటికే ఆమె 8 నెలల గర్భంతో ఉండగా, లోపల ముగ్గురు శిశువులు పెరుగుతున్నట్టు గుర్తించారు.

ఆ తర్వాతి రోజే ఆమె పరిస్థితి విషమించడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించిన  వైద్యులు ఉమ్మనీరుతోపాటు కరోనా కారణంగా ఆమె పరిస్థితి విషమించినట్టు గుర్తించి వెంటనే శస్త్రచికిత్స చేశారు. తల్లి కరోనా వ్యాధిగ్రస్థురాలు కావడంతో శిశువులకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుని శస్త్రచికిత్స నిర్వహించారు.

ఇద్దరు మగ పిల్లలు, ఓ ఆడ శిశువు జన్మించగా, వీరిలో ఇద్దరు 1.2 కిలోల బరువుతో పుట్టగా, ఒకరి బరువు 1.5 కిలోలు ఉంది. దీంతో వైద్యులు వారిని ఎస్ఎన్‌సీయూకు తరలించి చికిత్స అందించారు. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో శిశువులకు కరోనా నెగటివ్ అని తేలడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న తల్లికి నిర్వహించిన పరీక్షల్లోనూ నెగటివ్ అని రావడంతో అందరినీ డిశ్చార్జ్ చేశారు.
Nizamabad District
Corona Virus
woman
pregnant

More Telugu News