Bandi Sanjay: టీఆర్ఎస్ అహంకారాన్ని దెబ్బకొట్టేందుకే ఓటర్లు భారీగా తరలివచ్చారు: బండి సంజయ్

Bandi Sanjay press meet after Dubbaka By Election polling
  • ముగిసిన దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్
  • బండి సంజయ్ మీడియా సమావేశం
  • విజయం తమదేనని ధీమా
దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం తమదేనని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అంటున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక నుంచి తమకు స్పష్టమైన సమాచారం ఉందని, టీఆర్ఎస్ అహంకారాన్ని దెబ్బకొట్టాలని ప్రజలు భారీగా తరలివచ్చారని, అందుకే 81 శాతం ఓటింగ్ నమోదైందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను దుబ్బాక ప్రజలు గమనించారని, మోదీ సర్కారు మంచి పనులు తమకు కలిసొస్తాయని తెలిపారు.

దుబ్బాక ప్రజలంతా రఘునందన్ రావునే ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. దుబ్బాక ప్రజలు ఎంతో నిజాయతీపరులని, టీఆర్ఎస్ కార్యకర్తలు ఇచ్చిన డబ్బు తీసుకున్నా, బీజేపీకే ఓటేశారని తెలిపారు. దుబ్బాకలో అభివృద్ధి అనేదే జరగలేదని, ఇన్ని రోజులు అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ టీఆర్ఎస్ మభ్యపెట్టిందని విమర్శించారు.

కాగా, దుబ్బాక ఉప ఎన్నికల్లో మొత్తం 82.61 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.  ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు.
Bandi Sanjay
Dubbaka
By Polls
BJP
TRS

More Telugu News