JC Prabhakar Reddy: చేతకాకపోతే జగన్ మాదిరి సలహాదారులను పెట్టుకో: పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సలహా
- ఓ కంపెనీ కోసం రైతుల నుంచి భూములు తీసుకున్నారు
- కంపెనీ రాకపోవడం వల్ల వాళ్ల భూములు వాళ్లకు ఇచ్చేయాలి
- స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. తాడిపత్రి మండలం బొందలదిన్నె వంగనూరు గ్రామం వద్ద ఓ కంపెనీ కోసం రైతుల నుంచి భూములు తీసుకున్నారని... ఇప్పుడు ఆ కంపెనీ రాకపోవడం వల్ల, రైతులకు వారి భూములను ఇచ్చేయాలని సూచించారు.
పెద్దారెడ్డికి ఏ భాషలో చెప్పినా అర్థం కాదని ఎద్దేవా చేశారు. ఈ అంశంపై తాను కోర్టుకు వెళ్తే రైతులు నష్టపోతారని... అందుకే తాను కోర్టుకు వెళ్లడం లేదని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలలో అర్థం కాకపోతే... ముఖ్యమంత్రి జగన్ మాదిరి సలహాదారులను పెట్టుకోవాలని సూచించారు.
ఏపీలో న్యాయమే లేదని... రాత్రికి రాత్రే తనను అరెస్ట్ చేశారని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే ప్రసక్తే లేదని అన్నారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ దిగిపోయేంత వరకు ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించదని చెప్పారు. ఆయన దిగిపోయేంత వరకు ఈ అంశాన్ని ఏదో విధంగా మేనేజ్ చేస్తారని అన్నారు.