BJP: బీజేపీ బీహార్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల.. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేస్తామంటూ హామీ!

BJP Promises Free Covid Vaccination In Bihar Manifesto
  • బీహార్‌లో 19 లక్షల ఉద్యోగాల కల్పన
  • మరో 3 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ
  • రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తయారు చేస్తాం
  • 30 లక్షల మందికి పక్కా ఇళ్లు
బీహార్‌లోని 243 శాసనసభ స్థానాలకు ఈ నెల 28న తొలిదశ, నవంబరు 3, 7 తేదీల్లో రెండో, మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను నవంబరు 10న విడుదల చేస్తారు. ఎన్నికల నేపథ్యంలో‌ బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ఇచ్చిన హామీలను మించిన హామీలను గుప్పిస్తూ బీజేపీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

ఈ మేనిఫెస్టోను రాష్ట్ర బీజేపీ నేతల సమక్షంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడుదల చేశారు బీహార్‌లో కరోనా వ్యాక్సిన్‌ని అందరికీ ఉచితంగా ఇస్తామని కూడా మేనిఫెస్టోలో పేర్కొనడం గమనార్హం.  తమ ప్రభుత్వ పాలనలో బీహార్లో 15 ఏళ్లలో జీడీపీ 3 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారు.  

బీహార్‌లో ప్ర‌తి ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా ఇస్తామన్నది ఈ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో తాము ఇస్తోన్న తొలి హామీ అని అన్నారు. ఎన్డీఏను రాష్ట్రప్రజలు గెలిపించాల‌ని అన్నారు. బీహార్‌లో మ‌రో 5 సంవత్సరాల పాటు నితీశ్ కుమార్ సీఎంగా ఉంటార‌ని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నితీశ్ పాల‌న‌లోనే బీహార్ ఉత్త‌మ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంద‌ని చెప్పుకొచ్చారు.

బీహార్‌లో 19 లక్షల ఉద్యోగాల కల్పన, మరో 3 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తయారు చేయడం, 30 లక్షల మందికి పక్కా ఇళ్లు, 9వ తరగతి నుంచి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు వంటి అంశాలను బీజేపీ తమ మేనిఫెస్టోలో చేర్చింది.
BJP
Nirmala Sitharaman
COVID19
Corona Virus
vaccine

More Telugu News