Jio Pages: సరికొత్త మొబైల్ బ్రౌజర్ ను విడుదల చేసిన జియో... ఎనిమిది భాషల్లో అందుబాటులోకి!

Reliance Released Jio Browser in 8 Indian Languages
  • 'జియోపేజెస్' ను తెచ్చిన రిలయన్స్
  • గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే వీలు
  • సమాచార గోప్యతకు పెద్దపీట వేశామన్న జియో
'జియోపేజెస్' పేరిట ఓ సరికొత్త బ్రౌజర్ ను రిలయన్స్ జియో అందుబాటులోకి తెచ్చింది. గతంలో విడుదల చేసిన బ్రౌజర్ కు ఇది అప్ డేటెడ్ వర్షన్. ఇది ఎనిమిది భారతీయ భాషల్లో లభ్యమవుతుందని, మరింత మెరుగైన బ్రౌజింగ్ అనుభూతిని ఇస్తుందని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇదే సమయంలో వ్యక్తిగత సమాచార గోప్యతకూ పెద్ద పీట వేస్తుందని వెల్లడించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ఈ బ్రౌజర్ లో పేజీలు వేగంగా లోడ్ అవుతాయని, వీడియోల స్ట్రీమింగ్ వేగంగా ఉంటుందని జియో ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ఇక ఈ బ్రౌజర్ ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో అందుబాటులో ఉంటుందని, 'జియోపేజెస్' లో యూజర్లు తమకు నచ్చిన, కావాల్సిన కంటెంట్ ను కస్టమైజ్ చేసుకోవచ్చని తెలిపారు.

ఏ రాష్ట్రంలోని వారికి ఆ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన సైట్లు తొలుత కనిపిస్తాయని, అవసరమని భావించినవారు గూగుల్, బింగ్ వంటి సెర్చ్ సైట్లను డిఫాల్ట్ సెర్చింజన్లుగా మార్చుకోవచ్చని పేర్కొన్నారు. ఇక తన పాత బ్రౌజర్ ను వాడుతున్న దాదాపు 1.40 కోట్ల మందినీ కొత్త బ్రౌజర్ కు అప్ డేట్ చేస్తామని జియో తెలిపింది.
Jio Pages
Reliance
Browser

More Telugu News