శిఖర్ ధవన్ అజేయ సెంచరీ.. చెన్నైపై ఢిల్లీదే పైచేయి

Shikhar Dhawan ton makes delhi win
  • లక్ష్యాన్ని కాపాడుకోవడంలో చెన్నై విఫలం
  • ధవన్‌కు మూడుసార్లు లైఫ్ ఇచ్చి మూల్యం చెల్లించుకున్న వైనం
  • చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది ఢిల్లీని గెలిపించిన అక్సర్
ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించిన ధోనీ సేన మళ్లీ ఓడింది. గత రాత్రి షార్జా వేదికగా ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోమారు ఓటమి పాలైంది. శిఖర్ ధవన్ అజేయ సెంచరీకి తోడు, అక్షర్ పటేల్ ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో 180 పరుగుల విజయ లక్ష్యాన్ని ఢిల్లీ ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో బంతి మిగిలి ఉండగానే అందుకుంది. ఈ విజయంతో ఢిల్లీ 14 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు చేరువ కాగా, చెన్నై అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది.

చెన్నై ఓపెనర్ శామ్ కరన్ తొలి ఓవర్ మూడో బంతికే డకౌట్ అయి వెనుదిరిగినప్పటికీ డుప్లెసిస్ (47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58), వాట్సన్ (28 బంతుల్లో 6 ఫోర్లతో 36), రాయుడు (25 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 45), రవీంద్ర జడేజా (13 బంతుల్లో 4 సిక్సర్లతో 33) రాణించడంతో తొలుత చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

అనంతరం 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ తొలుత తడబడినట్టు కనిపించింది. ఓపెనర్ పృథ్వీషా తొలి ఓవర్ రెండో బంతికి డకౌట్ కాగా, 26 పరుగుల వద్ద రహానే (8) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అయ్యర్ (23), స్టోయినిస్ (24) భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. అయితే, అప్పటికే క్రీజులో కుదురుకున్న శిఖర్ ధవన్ జట్టును విజయం దిశగా నడిపించాడు. 58 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్‌తో 101 పరుగులు చేశాడు.

చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 17 పరుగులు అవసరం కాగా, ధవన్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. చివరి ఓవర్‌ను బ్రావో వేయాల్సి ఉండగా అస్వస్థత కారణంగా అతడు మైదానాన్ని వీడడంతో ధోనీ బంతిని జడేజాకు ఇచ్చాడు. ధవన్ ఎదుర్కొన్న తొలి బంతి వైడ్ కాగా, ఆ తర్వాతి బంతికి సింగిల్ వచ్చింది. ఇంకా విజయానికి 5 బంతుల్లో 15 పరుగులు అవసరం. రెండో బంతిని అక్సర్ పటేల్ స్టాండ్స్‌లోకి తరలించాడు. ఆ తర్వాతి బంతిని కూడా అక్సర్ సిక్సర్‌గా మలచడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది. నాలుగో బంతికి రెండు పరుగులు తీయడంతో మ్యాచ్ టై అయింది. అయితే, ఐదో బంతిని అక్సర్ మరోమారు స్టాండ్స్‌కు తరలించడంతో మ్యాచ్ ఢిల్లీ వశమైంది.

5 బంతులు మాత్రమే ఆడిన అక్సర్ పటేల్ 3 సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. అంతకుముందు ధవన్‌ మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 21, 50, 79 పరుగుల వద్ద అతడిచ్చిన క్యాచ్‌లను చెన్నై ఫీల్డర్లు నేలపాలు చేసి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నేడు హైదరాబాద్-కోల్‌కతా, ముంబై-పంజాబ్ మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.
Go Back to Shorts
CSK
DC
IPL 2020
Shikhar Dhawan

More Telugu News