Dead Body: ఇంట్లో కుళ్లిన శవంతో సహజీవనం... శ్రీకాకుళం జిల్లాలో ఘటన

Family living with rotten dead body in Srikakulam district
  • శ్రీకాకుళం జిల్లాలో ఘటన
  • రిటైర్డ్ అటెండర్ ఇంట్లో మృతదేహం
  • మానసిక సమస్యలతో బాధపడుతున్న కుటుంబం
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆదిత్య నగర్ లో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో కుళ్లిన శవంతో ఇతర కుటుంబ సభ్యులు సహవాసం చేస్తుండడం చూసి స్థానికులు, పోలీసులు విస్మయానికి గురయ్యారు.

పోలాకి సత్యనారాయణ అనే వ్యక్తి నీటిపారుదల శాఖలో అటెండర్ గా పనిచేసి రిటైరయ్యారు. ఆయన తన భార్య ఈశ్వరమ్మ, కుమారుడు, కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. అయితే, ఆదిత్యనగర్ ప్రాంతంలో ఈ కుటుంబం చాలా ప్రత్యేకం. వీరు ఇల్లు దాటి ఎప్పుడూ బయటికి రారు. ఎప్పుడైనా సత్యనారాయణ తన పెన్షన్ కోసం మాత్రమే బయటికి వస్తారు.

బంధువర్గం చాలామంది ఉన్నా, వీరి సంగతి తెలిసి ఎవరూ రారు. స్థానికులతోనూ వీరికి సంబంధాలు లేవు. అసలు, తమ ఇంటికి ఎవరినీ రానివ్వకుండా ఎప్పుడూ తాళాలు వేసుకుంటారు. గత కొన్నిరోజులుగా వారి ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తోంది. సత్యనారాయణ సోదరుడి కుమారుడు వెళ్లి పరిశీలించగా, మంచంపై శవం కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు. రెడ్ క్రాస్ ప్రతినిధులతో కలిసి అక్కడికి వచ్చిన పోలీసులు షాక్ తిన్నారు.

బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శవంతో వాళ్లు సహవాసం చేస్తుండడాన్ని నమ్మలేకపోయారు. ఆ మృతదేహం సత్యనారాయణ భార్య ఈశ్వరమ్మదిగా గుర్తించారు. అసలేం జరిగిందో తెలుసుకుందామని ప్రయత్నిస్తే, సత్యనారాయణ, ఇద్దరు పిల్లలు పిచ్చిపిచ్చిగా మాట్లాడసాగారు. దాంతో వారికి మతిస్థిమితం లేదని గుర్తించి, రెడ్ క్రాస్ ప్రతినిధులే పోలీసుల సాయంతో ఈశ్వరమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. సత్యనారాయణను, ఇతర కుటుంబ సభ్యులను ఏదైనా మానసిక చికిత్స కేంద్రానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
Dead Body
Srikakulam District
Arasavalli
Police

More Telugu News