Bairstow: సెంచరీ చేజార్చుకున్న బెయిర్ స్టో... సన్ రైజర్స్ భారీస్కోరు

Sunrisers posts a huge total after Bairstow heroics
  • దుబాయ్ లో పంజాబ్ జట్టుతో హైదరాబాద్ మ్యాచ్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు చేసిన సన్ రైజర్స్
  • 97 పరుగులు చేసిన బెయిర్ స్టో
ఐపీఎల్ తాజా సీజన్ లో మొదటిసారిగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు తమ బ్యాట్లు ఝుళిపించారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసింది. గత మ్యాచ్ ల్లో వైఫల్యాలను పక్కనబెడుతూ... కెప్టెన్ డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో ద్వయం చెలరేగి ఆడింది. వీరిద్దరూ తొలి వికెట్ కు 160 పరుగులు జోడించడం విశేషం.

ముఖ్యంగా బెయిర్ స్టో ధాటికి పంజాబ్ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 55 బంతుల్లోనే 97 పరుగులు చేసిన బెయిర్ స్టో దురదృష్టవశాత్తు ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. బెయిర్ స్టో స్కోరులో 7 ఫోర్లు, 6 భారీ సిక్సులున్నాయి. వార్నర్ కూడా వేగంగా ఆడి 40 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. ఈ జోడీ అవుటయ్యాక స్కోరు ఒక్కసారిగా మందగించింది. వెంటవెంటనే వికెట్లు పడడంతో సన్ రైజర్స్ అభిమానులు నిరాశకు గురయ్యారు.

అయితే విలియమ్సన్, అభిషేక్ శర్మ జోడీ ధాటిగా ఆడడంతో హైదరాబాద్ స్కోరు 200 మార్కు దాటింది. మొత్తమ్మీద నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, అర్షదీప్ సింగ్ 2, మహ్మద్ షమి ఓ వికెట్ సాధించారు.
Bairstow
Sunrisers
Kings XI Punjab
Dubai
IPL 2020

More Telugu News