Favipiravir: సులభతరం కానున్న కరోనా చికిత్స.. ఇంజెక్షన్ల రూపంలో రానున్న ఫావిపిరవిర్!

Hetero Drugs announces Favipiravir injections
  • కరోనా చికిత్సలో కీలకంగా ఉన్న ఫావిఫిరవిర్ ట్యాబ్లెట్లు
  • ఇండియాలో అధికంగా వినియోగిస్తున్న ఔషధం ఇదే
  • రోగులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇంజెక్షన్ల రూపంలో తెచ్చేందుకు యత్నం
కరోనా బాధితులకు చికిత్సలో భాగంగా ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. మన దేశంలో కరోనా చికిత్సలో ఎక్కువగా ఉపయోగిస్తున్న ఔషధం ఇదే. స్వల్ప, మధ్యస్థ కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ఈ యాంటీ వైరల్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు.

వాస్తవానికి 14 రోజుల చికిత్సలో ఫావిపిరవిర్ 200ఎంజీ ట్యాబ్లెట్లు 122 తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇన్ని ట్యాబ్లెట్లను మింగడం రోగికి కష్టమవుతుండటంతో... గత నెలలో ట్యాబ్లెట్ల కోర్సును మార్చారు. దీంతో ఈ మెడిసిన్ ను తయారు చేస్తున్న హైదరాబాదుకు చెందిన హెటిరో డ్రగ్స్ కోర్సులో మార్పులు చేసింది. 800 ఎంజీ, 200 ఎంజీల కాంబినేషన్ తో ట్యాబ్లెట్లను అందుబాటులోకి తెచ్చి... వాడాల్సిన ట్యాబ్లెట్ల సంఖ్యను 32కి తగ్గించింది.

తాజాగా హెటిరో డ్రగ్స్ కీలక ప్రకటన చేసింది. ఫావిపిరవిర్ ను ఇంజెక్షన్ల రూపంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. హైదరాబాద్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ, కరోనా పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించేందుకు ఇంజెక్షన్లు ఉపయోగపడతాయని చెప్పారు. త్వరలోనే ఈ ఇంజెక్షన్లు అందుబాటులోకి రానున్నాయి.
Favipiravir
Tablets
Injection
Hetero Drugs

More Telugu News