Bollywood: బాలీవుడ్ నటి రిచా చద్దాకు క్షమాపణలు చెప్పేందుకు పాయల్ ఘోష్ రెడీ.. రూ. 1.1 కోట్ల పరువునష్టం దావా ఉపసంహరణ
- ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలు చేసిన పాయల్
- పనిలో పనిగా రిచా చద్దాపై తీవ్ర ఆరోపణలు
- విచారం వ్యక్తం చేస్తూ స్టేట్‌మెంట్ ఉపసంహరణ
బాలీవుడ్ నటి రిచా చద్దాపై తీవ్ర ఆరోపణలు చేసిన మరోనటి పాయల్ ఘోష్ తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేసింది. తన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టుకు తెలపడంతో ఆమెపై రిచా చద్దా వేసిన రూ. 1.1 కోట్ల పరువునష్టం దావాను వెనక్కి తీసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. పాయల్ ఇటీవల ఓ తెలుగు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై అత్యాచార ఆరోపణలు చేసింది. అంతేకాక, రిచా చద్దా, మహీ గిల్, హ్యుమా ఖురేషీ వంటి వారి పేర్లను కూడా తెరపైకి తీసుకొచ్చింది.
వారు చాలా సాదాసీదాగా కనిపించినా కశ్యప్ వారికి అవకాశాలు ఇస్తున్నాడంటే అందులో ఉన్న మర్మమేంటో అర్థం చేసుకోవచ్చని, సాధారణంగా ఇలా నామమాత్రపు అందంతో కనిపించే వారికి దర్శకులు సలహాలు ఇవ్వరని పేర్కొంది. వారికి అవకాశాలు ఇస్తుండడం వెనక ఉన్న మతలబు అందరికీ తెలిసిందేనని నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. రిచా తనకు కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటుందని అనురాగ్ తనతో చెప్పినట్టు పేర్కొంది.
ఆమె వ్యాఖ్యలను మిగతా ఇద్దరూ సీరియస్‌గా తీసుకోకపోయినా రిచా మాత్రం తీవ్రంగా పరిగణించింది. తనపై ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిందంటూ సదరు నటిపై బాంబే హైకోర్టును ఆశ్రయించి రూ. 1.1 కోట్ల పరువునష్టం దావా వేసింది. నిన్న ఈ వ్యాజ్యం విచారణకు రాగా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి, స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు పాయల్ తరపు న్యాయవాది నితిన్ సత్పుటే తెలిపారు.
రిచాకు తన క్లయింట్ పెద్ద అభిమాని అని, ఆమెను గౌరవిస్తుందని పేర్కొన్నారు. రిచాను అప్రతిష్ఠపాలు చేయాలనుకోవడం ఆమె ఉద్దేశం కాదని, తన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవడంతోపాటు బేషరతు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు తెలిపారు.
దీంతో స్పందించిన రిచా తరపు న్యాయవాదులు వీరేందర్ తుల్జాపూర్కర్, సవీనా బేడీ సచార్‌లు పాయల్ క్షమాపణలను అంగీకరిస్తున్నామని, దావాను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.