Earthquake: హైదరాబాద్ బోరబండలో మరోసారి ప్రకంపనలు... ఇళ్లలోంచి పరుగులు తీసిన ప్రజలు
- రెండ్రోజుల కిందట హైదరాబాదులో ప్రకంపనలు
- అప్పటికంటే ఇప్పుడు మరింత భారీ శబ్దాలు
- ప్రజల్లో తీవ్ర భయాందోళనలు
రెండ్రోజుల కిందట హైదరాబాద్ లోని బోరబండ, రహ్మత్ నగర్, సైట్-3 ఏరియాల్లో భూమి కంపించడం, భారీ శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇవాళ మధ్యాహ్నం కూడా అదే తరహాలో మరోసారి భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. రెండ్రోజుల క్రితం వచ్చిన శబ్దాల కంటే ఈసారి మరింత బిగ్గరగా శబ్దాలు రావడంతో ప్రజలు ఏం జరుగుతోందో తెలియక భీతావహులయ్యారు.
కాగా, శుక్రవారం రాత్రి పొద్దుపోయాక బోరబండ, ఇతర ప్రాంతాల్లో భూమి కంపించడం తీవ్ర కలకలం రేపింది. భారీ శబ్దాలకు భయపడిపోయిన ప్రజలు ఇళ్లలోకి వెళ్లేందుకు సాహసించలేకపోయారు. అర్ధరాత్రి దాటే వరకు రోడ్లపైనే గడిపారు. 2017 అక్టోబరులోనూ ఇలాంటి శబ్దాలే వచ్చాయని స్థానికులు అంటున్నారు.