చివరి ఓవర్లో ఛాతీపై బంతి తగిలినా సిక్సర్లు బాదిన తెవాటియా

Tewatia hits huge sixers after Saini beamer
  • హై ఫుల్ టాస్ విసిరిన సైనీ
  • బంతిని ఆడబోయి విఫలమైన తెవాటియా
  • ఆపై రెండు బంతుల్లో రెండు సిక్సర్లు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మన్ రాహుల్ తెవాటియా మరోసారి తన ట్రేడ్ మార్కు ఇన్నింగ్స్ ఆడాడు. ఇవాళ అబుదాబిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో చివరి ఓవర్లో నవదీప్ సైనీ విసిరిన ఓ హై ఫుల్ టాస్ తెవాటియా ఛాతీపై బలంగా తాకింది. బాధతో విలవిల్లాడుతూ తెవాటియా కిందపడిపోయాడు. అయితే వెంటనే తేరుకున్న ఎడంచేతి వాటం ఆటగాడు ఆపై రెచ్చిపోయాడు. వరుసగా రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాది ప్రతీకారం తీర్చుకున్నాడు. మొత్తమ్మీద తెవాటియా 12 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 24 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ 12 బంతుల్లో 22 పరుగులు చేశాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (5) తక్కువ స్కోరుకు అవుటయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సంజు శాంసన్ (4) అందరినీ నిరాశకు గురిచేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న మహిపాల్ లొమ్రోర్ 47 పరుగులతో రాణించాడు. చివర్లో తెవాటియా ధాటిగా ఆడడంతో రాజస్థాన్ స్కోరు 150 మార్కు దాటింది.
Go Back to Shorts
Rahul Tewatia
Sixers
Beamer
Saini
Rajasthan Royals
Royal Challengers Banglore
IPL 2020

More Telugu News