Yogi Adityanath: హత్రాస్ కేసులో ఎస్పీ, డీఎస్పీని సస్పెండ్ చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు

UP CM has directed to suspend SP and DSP in Hathras case based in preliminary investigation
  • హత్రాస్ లో యువతిపై భయానక దాడి
  • చికిత్స పొందుతూ యువతి మృతి
  • మృతదేహాన్ని అర్ధరాత్రి దహనం చేసిన పోలీసులు
సంచలనం సృష్టించిన హత్రాస్ కేసులో పోలీసుల తీరు దిగ్భ్రాంతి కలిగించేలా ఉందన్న ఆగ్రహావేశాల నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర చర్యలకు ఉపక్రమించారు. హత్రాస్ జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇన్ స్పెక్టర్లతో పాటు మరికొందరు అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అంతేకాదు, ఎస్పీ, డీఎస్పీలకు నార్కో పాలీగ్రాఫ్ టెస్టులు కూడా నిర్వహిస్తారని పేర్కొంది.

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో కొన్నిరోజుల కిందట 19 ఏళ్ల యువతిపై కొందరు వ్యక్తులు అత్యంత దారుణమైన రీతిలో దాడికి పాల్పడగా, ఆ యువతి ఢిల్లీలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె నాలుక కోసేసిన దుర్మార్గులు, నడుం విరగ్గొట్టి పైశాచికంగా ప్రవర్తించినట్టు తేలింది. అయితే, ఫోరెన్సిక్ నివేదికలో ఆమెపై అత్యాచారం జరగలేదని తేలిందని పోలీసులు వెల్లడించారు.

ఇదిలావుంటే, ఆ అమ్మాయి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే బుధవారం అర్ధరాత్రి హడావుడిగా దహనం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. దాంతో ఈ ఘటనలో పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం జోక్యం చేసుకున్నట్టు అర్థమవుతోంది.
Yogi Adityanath
Hathras
Suspension
Police
Uttar Pradesh

More Telugu News