vijaya shanti: రక్తాశ్రులు చిందిస్తూ శోకంతో.. పాటను గుర్తుచేస్తూ విజయశాంతి పోస్టు!

vijaya shanti on rape cases
  • యూపీలో మహిళలపై దారుణాల పట్ల విజయశాంతి స్పందన 
  • ప్రతిఘటన సినిమాలోని పాట గుర్తుకొస్తుందని వ్యాఖ్య
  • నిర్భయ, దిశ ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయని ఆవేదన
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో సామూహిక అత్యాచారానికి గురైన 20 ఏళ్ల యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.  ఈ నెల 14న అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు కామాంధులు, అనంతరం ఆమె నాలుకను కోసి దారుణానికి తెగబడిన ఘటన చోటు చేసుకుంది. అదే రాష్ట్రంలో ఒక వివాహితపై ఇద్దరు డ్రైవర్లు దారుణంగా అత్యాచారం చేశారు.

వీటిపై దేశ వ్యాప్తంగా ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఘటనలపై కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి విజయ శాంతి స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను నటించిన ప్రతిఘటన సినిమాలోని ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో... రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో' అనే పాటను గుర్తు చేస్తూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు.

దేశంలోని మహిళలపై జరుగుతున్న దారుణాల గురించి విన్నప్పుడల్లా ప్రతిఘటన సినిమాలోని ఈ పాటే తనకు గుర్తుకొస్తుందని విజయశాంతి అన్నారు. నిర్భయ, దిశ ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యూపీలో తన పిల్లలతో కలసి బస్సు ఎక్కిన ఒక వివాహితపై ఇద్దరు డ్రైవర్లు దారుణంగా అత్యాచారం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, ఎందరు పోలీసులు ఉన్నా, నైతికంగా సమాజం శక్తిమంతం కానంత వరకూ ఈ వ్యవస్థలో ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయని ఆమె అన్నారు.

తల్లిదండ్రులలో ఎంతమంది ఆడపిల్లల పట్ల గౌరవం పెరిగేలా తమ ఇంట్లోని అబ్బాయిలను తీర్చిదిద్దుతున్నారని విజయశాంతి ప్రశ్నించారు. బాధిత కుటుంబాలను చూసి జాలి పడి ఆగిపోవద్దని, రేపటి బిడ్డలు కూడా ఇదే సమాజంలోకి అడుగుపెడతారన్న వాస్తవాన్ని మరచిపోవద్దని ఆమె చెప్పారు. మన మనుగడకు, జాతి గౌరవానికి మూలం మహిళేనని గుర్తించాలని, ఇప్పటికైనా మేలుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళ గర్వపడేలా మన సమాజాన్ని తీర్చిదిద్దుకుందామని ఆమె చెప్పారు.
vijaya shanti
Congress
Tollywood

More Telugu News