KCR: ప్రజలందరి ఆస్తులకు పూర్తి స్థాయి రక్షణ: కేసీఆర్

KCR Says Government Will Protect Peoples All Assets
  • వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ రంగులో పట్టాదార్ పాస్ పుస్తకాలు
  • అమలులోకి రానున్న రెవెన్యూ చట్టం విప్లవాత్మకం
  • మంత్రులు, అధికారులతో సమీక్షలో కేసీఆర్
ఇండియాలోనే తొలిసారిగా తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ బుక్స్ జారీచేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో అమలులోకి రానున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్య తరగతి సహా ప్రజలందరి ఆస్తులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం పేర్కోన్నారు.

ప్రజల యొక్క దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. భూ వివాదాలు , ఘర్షణలను నివారించడంతో పాటు ప్రజల ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం ఈ పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.

నిన్న రాత్రి వరకూ రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు తదితర అంశాలపై ప్రగతి భవన్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న బావుల వద్ద ఇండ్లు, ఫామ్ హౌజ్ లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్ లైన్ లో ఎన్ రోల్ (మ్యూటేషన్) చేయించుకోవాలని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలకు విజప్తి చేశారు.

ఇక ముందు ఒక ఇంచు భూమి ఒకరి పేరు నుండి మరొకరి పేరుమీదకి బదిలీ కావాలంటే ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిష్ట్రేషన్ జరుగుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయేతర ఆస్తుల వివరాలు, ఆధార్ కార్డు వివరాలతో సహా కుటుంబ సభ్యుల వివరాలు పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది ద్వారా ఇంటి నెంబర్ తీసుకుని ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయించుకోవాలని, ఇప్పుడు ఆస్తుల వివరాలను మ్యుటేషన్ చేయించుకోకపోతే భవిష్యత్తులో ఆస్తులను తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో సమస్య తలెత్తే అవకాశం వుందని హెచ్చరించారు.

నిరుపేద ప్రజలు ఎన్నో ఏండ్లుగా వుంటున్న ఇండ్ల స్థలాలను పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేయనున్నామని కూడా ఆయన ప్రకటించారు. దీనివల్ల నిరుపేదల ఇంటి స్థలాలకు రక్షణ ఏర్పడడమే కాకుండా ఆ ఆస్తుల మీద బ్యాంకు రుణాలు తీసుకునే వెసులుబాటు పేదలకు కలుగుతుందని సీఎం పేర్కోన్నారు. ఈ ఆస్తుల మ్యుటేషన్ కు, ఎల్ఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

వ్యవసాయ భూముల వద్ద నిర్మించుకున్న ఇండ్లు తదితర ఆస్తుల విస్తీర్ణాన్ని వ్యవసాయ కేటగిరి నుంచి తొలగించే విషయంలో ప్రజలకు సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించాలని సీఎం అన్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఎంపీఓలు పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.
KCR
Review
Meroon Colour
Pass Book

More Telugu News