KCR: రాజ్యసభలో వ్యవసాయ బిల్లును గట్టిగా వ్యతిరేకించండి... తమ ఎంపీలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

CM KCR orders TRS Rajya Sabha MPs do not vote for Agriculture Bill
  • కేంద్ర వ్యవసాయ బిల్లును రైతు వ్యతిరేక బిల్లుగా పేర్కొన్న కేసీఆర్
  • ఆర్థిక సంక్షోభంలో ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారని ఆగ్రహం
  • బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని ఎంపీలకు దిశానిర్దేశం
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని, రైతులను దెబ్బతీసి కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉండే ఈ బిల్లును రాజ్యసభలో గట్టిగా వ్యతిరేకించాలంటూ ఎంపీ కె.కేశవరావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చంటూ బిల్లులో చెబుతున్నారని, నిజానికి రైతులు తమకున్న కొద్దిపాటి సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమయ్యే పనేనా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

ఇది తేనె పూసిన కత్తి లాంటి చట్టం అని, దీన్ని కచ్చితంగా వ్యతిరేకించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం మక్కల (మొక్కజొన్న) దిగుమతిపై 50 శాతం సుంకం అమలులో ఉందని, దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే 75 లక్షల టన్నులు కొనుగోలు చేసిందని, భారీగా సుంకం తగ్గించడం ఎవరి ప్రయోజనం కోసం చేసిందని కేసీఆర్ నిలదీశారు.

"దేశం ఆర్థిక సంక్షోభంలో నిలిచిన సమయంలో ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు? మనదేశంలో పుష్కలంగా మక్కలు పండుతున్నాయి. ఇప్పుడు సుంకం తగ్గించి మరీ మక్కలు దిగుమతి చేస్తుంటే మన దేశ రైతుల పరిస్థితి ఏంటి? కేంద్రం తీసుకువచ్చిన ఈ బిల్లు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం తీసుకొచ్చే విధంగా ఉంది. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంది. రాజ్యసభలో దీన్ని గట్టిగా వ్యతిరేకించి, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయండి" అంటూ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
KCR
Agriculture Bill
TRS
Rajya Sabha
Centre
Telangana

More Telugu News