Parliament: కొత్త పార్లమెంటు భవన నిర్మాణ ప్రాజెక్టును దక్కించుకున్న టాటా గ్రూపు!

Tata Projects Ltd wins bid to construct parliament building
  • టాటా, ఎల్ అండ్ టీ సహా పోటీ పడిన ఏడు సంస్థలు
  • 1400 మంది ఎంపీలు కూర్చునేలా నిర్మాణం
  • 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ప్రారంభం
కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు మొత్తం ఏడు సంస్థలు పోటీపడగా చివరికి రూ. 861.90 కోట్లకు బిడ్ దాఖలు చేసిన టాటా ప్రాజెక్ట్స్‌కు ఇది దక్కింది. లార్సన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) రూ. 865 కోట్లకు కోట్ చేసింది. ఫలితంగా తక్కువ ధరకు కోట్ చేసిన టాటాకు ఇది దక్కింది.

సెంట్రల్ విస్తా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ పనులు దక్కించుకున్న టాటా 21 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ముందే దీనిని ప్రారంభించాలని కేంద్రం గట్టి పట్టుదలగా ఉంది. పార్లమెంటుకు సమీపంలో 118 ప్లాటులో నిర్మించనున్న దీని ఆకృతి త్రికోణాకారంలో ఉండనుంది. ఎంపీల సీట్లు పెరిగే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా అత్యంత విశాలంగా దీనిని నిర్మించనున్నారు. 1400 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణం ఉంటుందని కేంద్ర ప్రజా పనుల విభాగం పేర్కొంది. భవన ఫ్లింత్ ఏరియా సుమారు 65 వేల చదరపు మీటర్లు కాగా, రెండు అంతస్తులతోపాటు బేస్‌మెంట్ ఏరియా కూడా ఉంటుంది.

భవన నిర్మాణం తర్వాత ప్రభుత్వ అధికారిక చిహ్నాలుగా ఉన్న నార్త్, సౌత్ బ్లాక్‌లు మ్యూజియంగా మారే అవకాశం ఉంది. ఇక, ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి సచివాలయం నిర్మించనుండడంతో ఇందుకోసం శాస్త్రిభవన్, ఉద్యోగ్ భవన్, ఉపరాష్ట్రపతి నివాసంతోపాటు పలు భవనాలను కూల్చివేయనున్నారు.ఉమ్మడి సచివాలయం కనుక పూర్తయితే ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న కేంద్రకార్యాలయాలు ఇక్కడికి చేరుకుంటాయి. ఫలితంగా ఏడాదికి 1000 కోట్ల రూపాయలను అద్దెగా చెల్లించే బాధతప్పుతుంది. ప్రధానమంత్రి కార్యాలయాన్ని సౌత్‌బ్లాక్ దగ్గరలో, ఉపరాష్ట్రపతి నివాసాన్ని నార్త్ బ్లాక్ సమీపంలో నిర్మించనున్నారు.
Parliament
Tata projects ltd
India
L&T

More Telugu News