ప్లాస్మా థెరపీ వల్ల ఉపయోగం లేకుండా పోయింది: ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి
- 14 రాష్ట్రాల్లోని 39 ఆసుపత్రుల్లో 469 మంది బాధితులపై అధ్యయనం
- ప్లాస్మాదానంతో తగ్గని కరోనా మరణాలు, తీవ్రత
- ప్లాస్మా థెరపీ కొనసాగింపుపై త్వరలో నిర్ణయం
14 రాష్ట్రాల్లోని 39 ఆసుపత్రుల్లో 469 మంది బాధితులపై చేసిన అధ్యయనంలో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. కొవిడ్ మరణాలను ప్లాస్మా థెరపీ ఏమాత్రం తగ్గించలేకపోయిందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. మరణాలతోపాటు రోగ తీవ్రతను కూడా ఇది తగ్గించలేకపోయిందని పేర్కొన్నారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌తో కలిసి నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ అధ్యయన వివరాలు ఇంకా ప్రచురితం కాలేదు. దీనిపై శాస్త్రవేత్తల సమీక్ష కొనసాగుతోంది. సమీక్ష పూర్తయిన అనంతరం అధ్యయనం ప్రచురితం కానుంది. అధ్యయనంలో వెల్లడైన విషయాలను టాస్క్‌ఫోర్స్, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త పర్యవేక్షక బృందం పరిశీలించిన అనంతరం ప్లాస్మా థెరపీ విధానాన్ని కొనసాగించాలా? వద్దా? అన్న విషయాన్ని నిర్ణయిస్తాయని భార్గవ పేర్కొన్నారు.