Rajnath Singh: చైనాతో సరిహద్దు వివాదాలపై లోక్ సభలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన

Union defense minister Rajnath Singh makes a statement about China issue in Loksabha
  • తాము శాంతినే కోరుకుంటున్నామని పునరుద్ఘాటన
  • చైనా దూకుడుగా వెళుతోందని వ్యాఖ్యలు
  • మే నెల నుంచి భారీగా మోహరింపులు చేపడుతోందని వెల్లడి
  • సార్వభౌమాధికారం విషయంలో రాజీపడేది లేదని స్పష్టీకరణ
  • చైనా రక్షణమంత్రికి ఇదే విషయం చెప్పామని వెల్లడి
భారత్-చైనా సరిహద్దు సమస్యపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో ప్రసంగించారు.  1962లో లడఖ్ లో చైనా 90 వేల చదరపు కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించిందని తెలిపారు. చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదని వెల్లడించారు. సరిహద్దుల నిర్ణయానికి చైనా ఒప్పుకోవడంలేదని అన్నారు. ఎల్ఏసీ అంశంలో రెండుదేశాల మధ్య వివాదాలు ఉన్నాయని తెలిపారు.

ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకునేందుకు ఎంతో ప్రయత్నించామని, చైనాతో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నామని వివరించారు. సరిహద్దుల విషయంలో సామరస్య పూర్వక పరిష్కారం కోరుకుంటున్నామని చెప్పారు. అందుకు చర్చలే సరైన ప్రాతిపదిక అని భావిస్తున్నామని రాజ్ నాథ్ తమ వైఖరి స్పష్టం చేశారు. అయితే, చైనా దూకుడు చర్యలతో శాంతి ఒప్పందంపై తీవ్ర ప్రభావం పడిందని వెల్లడించారు. సరిహద్దు సమస్య తేలేవరకు ఎల్ఏసీని గౌరవించాలన్న నిర్ణయాన్ని చైనా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.

మే నుంచి సరిహద్దుల్లో భారీగా ఆయుధాలు, సైన్యాన్ని మోహరిస్తోందని, దాంతో భారత్ కూడా తగిన రీతిలో సైన్యాన్ని మోహరిస్తోందని తెలిపారు. చైనా ఏకపక్ష చర్యలను భారత్ ఖండిస్తోందని, సరిహద్దులను మార్చాలన్న చైనా కుయుక్తులను మన సైన్యం తిప్పికొట్టిందని పేర్కొన్నారు. ఎంతో సంక్లిష్టమైన పరిస్థితుల్లో మన సైన్యం చైనా ఆక్రమణలను నిలువరించిందని రాజ్ నాథ్ సింగ్ వివరించారు. దౌత్య మార్గాల ద్వారా సమస్య పరిష్కారం కావాలన్నది తమ అభిమతమని, అయితే ఎల్ఏసీని చైనా కూడా గౌరవించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇటీవలి పరిణామాల నేపథ్యంలో చైనా కదలికలను నిరంతరం గమనిస్తున్నామని అన్నారు. ఆగస్టులో భారత్ ను రెచ్చగొట్టేందుకు చైనా ప్రయత్నించిందని, సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడిందని వెల్లడించారు. ఆగస్టు 29, 30 రాత్రి చైనా చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టిందని చెప్పారు. మన సైన్యం అందుకు దీటుగా బదులిచ్చిందని, 1993, 96 ఒప్పందాలను చైనా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. చైనా వైఖరి గమనించి సరిహద్దుల్లో బలగాలను మరింత పెంచామని, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు అయినా సన్నద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.

భారత్ తో కలిసి నడవాలని చైనాను కోరుతున్నామని, అదే సమయంలో సార్వభౌమత్వం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. రష్యాలో జరిగిన సమావేశంలో చైనా రక్షణ మంత్రికి ఇదే విషయం స్పష్టం చేశామని తెలిపారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు పెంచుతున్నామని, దేశం మొత్తం సైన్యం వెంటే ఉందని ఉద్ఘాటించారు.
Rajnath Singh
Lok Sabha
China
Border
LAC
India

More Telugu News