KTR: తెలంగాణ జేఈఈ ర్యాంకర్లను అభినందించిన మంత్రి కేటీఆర్

Telangana IT Minister KTR appreciates JEE Main rankers
  • శుక్రవారం విడుదలైన జేఈఈ ఫలితాలు
  • తెలంగాణకు చెందిన 8 మందికి మెరుగైన ర్యాంకులు
  • అమ్మాయిల విభాగంలో చుక్కా తనూజ టాపర్
అఖిల భారత స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్ 2020 ఫలితాలు శుక్రవారం రాత్రి వెల్లడైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు 8.67 లక్షల మంది హాజరయ్యారు. మొత్తం 660 కేంద్రాల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించారు. ఇక ఫలితాల్లో తెలంగాణ బిడ్డలు అద్భుతంగా రాణించడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. జేఈఈ మెయిన్ రిజల్ట్స్ లో 100 పర్సంటైల్ స్కోరు సాధించింది దేశం మొత్తమ్మీద 24 మందే కాగా, వారిలో 8 మంది తెలంగాణ విద్యార్థులు ఉండడం విశేషం.

ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకున్నారు. "జేఈఈ మెయిన్ ఎగ్జామ్ లో తమ అమోఘమైన ప్రదర్శనతో అందరినీ గర్వించేలా చేసిన తెలంగాణ యువ కిశోరాలకు నా శుభాభినందనలు. ఓవరాల్ గా 24 మందికి 100 పర్సంటైల్ స్కోరు వస్తే వారిలో 8 మంది తెలంగాణ వాళ్లే. వాళ్లలో అమ్మాయిల విభాగం టాపర్ చుక్కా తనూజ కూడా ఉంది. అద్వితీయమైన సాధన" అంటూ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

చుక్కా తనూజ, వడ్డేపల్లి అరవింద్ కుమార్, రొంగల అరుణ్ సిద్ధార్థ, యశష్ చంద్ర, శిక్ష కృష్ణ సాగి, మోరెడ్డిగారి లిఖిత్ రెడ్డి, రాచపల్లె శశాంక్ అనిరుధ్, చాగరి కౌశల్ కుమార్ జేఈఈ మెయిన్ 2020లో మెరుగైన ర్యాంకులు సాధించారు. కాగా, ఆలిండియా లెవల్లో జేఈఈ మెయిన్ లో రాజస్థాన్ కు చెందిన అఖిల్ జైన్ టాపర్ గా నిలిచాడు.
KTR
JEE Main
Rankers
Telangana
India

More Telugu News