Prabhas: 'రాధే శ్యామ్'లో ప్రభాస్ లుక్స్ కి దర్శకుడి కితాబు!

Director Radha Krishna Kumar about Radhe Shyam movie
  • వచ్చే నెల నుంచి 'రాధే శ్యామ్' షూటింగ్  
  • ప్రభాస్ తో సినిమా అన్నది నా కల
  • సెట్స్ లో ఆనందంగా ఉందన్న దర్శకుడు
ప్రస్తుతం సెట్స్ మీదున్న ప్రభాస్ సినిమా 'రాధే శ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ లాక్ డౌన్ కి ముందు జార్జియాలో జరిగింది. కథ ప్రకారం ఇటలీ వెళ్లి చిత్రీకరించాల్సిన సన్నివేశాలు కూడా ఉండడంతో అక్కడికి వెళ్లడానికి ఇంతకుముందు ప్లాన్ చేసినా, కరోనా కారణంగా అది కేన్సిల్ అయింది. దీంతో ఆ షూటింగును కూడా వచ్చే నెల నుంచి హైదరాబాదులోనే సెట్స్ లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలావుంచితే, ఈ చిత్రం గురించి తాజాగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తన మనసులోని భావాలను చెప్పాడు. డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేయాలనేది తన కల అనీ, అది నిజమవుతున్నందుకు ఆనందంగా వుందని చెప్పాడు. ఇక సెట్స్ లో ప్రభాస్ తో పనిచేస్తుంటే ఎంతో ఆనందంగా వుందని అన్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సందర్భంగా థియేటర్లలో కలుద్దామని చెప్పాడు. అసలు 'రాధే శ్యామ్' చిత్రం మొత్తానికే డార్లింగ్ ప్రభాస్ లుక్స్ పెద్ద ఎస్సెట్ అని దర్శకుడు రాధాకృష్ణ కితాబునిచ్చాడు.

ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అందాలబొమ్మ పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రం తర్వాత వరుసగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించే చిత్రం, ఓం రౌత్ దర్శకత్వంలో టీ సీరీస్ నిర్మించే 'ఆదిపురుష్'లోను ప్రభాస్ నటిస్తాడు.  
Prabhas
Pooja Hegde
Radha Krishna Kumar

More Telugu News