Nutan Naidu: విశాఖ శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్

Police arrests Nutan Naidu in tonsure case
  • ఉడిపిలో నూతన్ నాయుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
  • మాజీ ఐఏఎస్ అధికారి పేరుతో నూతన్ నాయడు ఫోన్ కాల్స్
  • పీవీ రమేశ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 
ఇటీవలే విశాఖపట్నంలో జరిగిన శిరోముండనం ఘటనలో బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని ఉడిపిలో నూతన్ నాయుడును అరెస్ట్ చేశామని విశాఖ సీపీ మనీశ్ కుమార్ సిన్హా వెల్లడించారు. నూతన్ నాయుడును కోర్టులో హాజరు పరిచామని వివరించారు. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరుతో డాక్టర్ సుధాకర్ కు నూతన్ నాయుడు ఫేక్ కాల్స్ చేశాడని సీపీ తెలిపారు.

మీ పేరుతో నాకు ఫోన్ కాల్ వచ్చిందని డాక్టర్ సుధాకర్ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ కు తెలిపారని, దాంతో పీవీ రమేశ్ ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారని సీపీ వివరించారు. తన ఫోన్ నెంబర్ ను మరో వ్యక్తి వినియోగిస్తున్నట్టు రమేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. తన పేరుతో ఫోన్లు చేస్తున్న వ్యక్తి ఎవరో కనుక్కోవాలని ఆయన పోలీసులను కోరారని, తాము దర్యాప్తు చేయగా అది నూతన్ నాయుడేనని తేలిందని సీపీ వెల్లడించారు.

ఆ ఫోన్ నెంబర్ తో నూతన్ నాయుడు 30 మంది అధికారులతో మాట్లాడాడని అన్నారు. సిమ్ ను ధ్వంసం చేయాలని కూడా నూతన్ నాయుడు ప్రయత్నించాడని, అయితే, నూతన్ నాయుడు నుంచి సిమ్ ను, ఫోన్ ను కర్ణాటక పోలీసులు ఎంతో చాకచక్యంగా సేకరించారని వివరించారు.

ఇటీవల, విశాఖలోని నూతన్ నాయుడు నివాసంలో శ్రీకాంత్ అనే దళిత యువకుడికి శిరోముండనం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య మధుప్రియ, మరో ఆరుగురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు.
Nutan Naidu
Police
Vizag
Tonsure

More Telugu News