TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం.. సీఎం జగన్‌కు సుబ్రహ్మణ్య స్వామి కృతజ్ఞతలు

ttd takes dicision on audit
  • టీటీడీలో జరిగే ఆడిట్‌పై విమర్శలు
  • ఈ నేపథ్యంలో కాగ్‌తో ఆడిట్‌కు పాలకమండలి నిర్ణయం
  • ‌ప్రభుత్వానికి పాలకమండలి సిఫార్సు
  • టీటీడీ నిర్ణయంపై సుబ్రహ్మణ్య స్వామి హర్షం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరిగే ఆడిట్‌పై విమర్శల నేపథ్యంలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆడిట్‌ను ఇకపై నుంచి  కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్ ద్వారా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పాలకమండలి సిఫార్సు చేసింది. 2014-20 వరకు ఇప్పటికే స్టేట్ ఆడిట్ డిపార్టుమెంట్ ఆడిట్ నిర్వహించారు. దీనిపై కూడా కాగ్ ద్వారా ఆడిట్ నిర్వహించాలని పాలకమండలి కోరింది.

వీటిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, 2014-19 మధ్య టీటీడీ నిధుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో దీనిపై కాగ్ ద్వారా ఆడిట్ జరపాలని ఎంపీ సుబ్రమణ్యస్వామి, సత్యపాల్ సభర్వాల్ హైకోర్టును కూడా ఆశ్రయించారు.

ఇక టీటీడీ తాజా నిర్ణయంపై సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్‌తో ఆడిట్‌ చేయించాలన్నది గొప్ప నిర్ణయమన్నారు. ఈ నిర్ణయం వెల్లడి చేసినందుకు ఏపీ సీఎం జగన్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పాలకమండలి సభ్యులు గొప్ప మనసుతో కాగ్‌తో ఆడిట్ చేయించడానికి అంగీకరించారని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. దీనిపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి... ఏపీ సీఎం  అవినీతిరహిత పాలనలో ఎంతగా నిబద్ధతతో ఉన్నారో దీని ద్వారా తెలుస్తోందని చెప్పుకొచ్చారు.
TTD
Tirumala
Tirupati
Jagan

More Telugu News