America: ప్రపంచంతో మాకేంటి సంబంధం.. వ్యాక్సిన్ విషయంలో సహకరించుకునేందుకు నో!

US to not join COVAX alliance to find vaccine
  • కోవాక్స్ కూటమిలో చేరేందుకు అమెరికా నిరాకరణ
  • ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై స్వదేశంలోనూ విమర్శలు
  • అమెరికా పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన
కరోనా వ్యాక్సిన్ విషయంలో తమది భిన్నమైన దారి అని అమెరికా పేర్కొంది. టీకా అభివృద్ధి, పంపిణీ విషయంలో తామెవరితోనూ కలిసి నడవబోమని, తమను తాము నిర్బంధించుకోదలచుకోలేదని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)పైనా తీవ్ర ఆరోపణలు చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనాతోపాటు డబ్ల్యూహెచ్ఓ కూడా కారణమైందని తీవ్ర ఆరోపణలు చేసింది. టీకా అభివృద్ధి, దాని పంపిణీ విషయంలో పరస్పరం సహకరించుకునేందుకు డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో 150 దేశాలు కొవాక్స్ పేరిట ఓ కూటమిగా ఏర్పడ్డాయి.

వివిధ దశల్లో ఉన్న కరోనా టీకాను అందిపుచ్చుకుని పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఫలితంగా ఏ టీకా అయితే కరోనాపై సమర్థంగా పనిచేస్తుందో దాని నుంచి వీలైనంత త్వరగా లబ్ధిపొందాలన్నది వాటి ఆలోచన. ఈ ఒప్పందం వల్ల అందరికీ ప్రయోజనం లభిస్తుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అయితే, ట్రంప్ ప్రభుత్వం మాత్రం వీటితో కలవకుండా ఒంటరిగానే వెళ్లాలని నిర్ణయించింది.

అయితే, ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై స్వదేశంలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహమ్మారిని ఓడించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఇది గండికొట్టే ప్రమాదం ఉందని డెమోక్రటిక్ చట్టసభ్యుడు అమీ బెరా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఒంటెత్తు పోకడలు పనికిరావని, కోవాక్స్‌లో చేరడం ద్వారా ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించే భరోసా ఏర్పడుతుందని అన్నారు. అంతేకాదు, ఈ నిర్ణయం వల్ల అమెరికా పౌరుల ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
America
Donald Trump
corona vaccine
Covax

More Telugu News