Hardeep Singh: ఇకపై ప్రభుత్వం విమానాశ్రయాలు నడిపే పరిస్థితి లేదు: కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి సంచలన వ్యాఖ్యలు!

Aviation Minister Says Govt should not be running airports
  • ఈ ఏడాది చివరి నాటికి ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ
  • పీపీఈ విధానానికి పెద్ద పీట వేస్తాం
  • దేశంలోని 100కు పైగా విమానాశ్రయాలు ప్రైవేటు పరం
  • నమో యాప్ వర్చ్యువల్ మీట్ లో హర్ దీప్ సింగ్ పురి
ఇండియాలోని విమానాశ్రయాలను, విమానయాన సంస్థలను కేంద్ర ప్రభుత్వం స్వయంగా నడిపించే పరిస్థితి లేదని పౌరవిమానయాన మంత్రి హర్ దీప్ సింగ్ పురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఈ సంవత్సరం లోనే పూర్తవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇటీవల సమావేశమైన కేంద్ర క్యాబినెట్, కేరళలోని తిరువనంతపురం ఎయిర్ పోర్టును అదానీ ఎంటర్ ప్రైజస్ కు అప్పగించడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో హర్ దీప్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదే సమయంలో దేశంలోని విమానాశ్రయాల నిర్వహణలో పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్) విధానానికి పెద్దపీట వేస్తామని ఆయన వెల్లడించారు.

తాజాగా నమో యాప్ ద్వారా జరిగిన ఓ వర్చ్యువల్ మీట్ లో మాట్లాడిన ఆయన, "నేను నా మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ప్రభుత్వం విమానాశ్రయాలను నడిపించే పరిస్థితి లేదు. విమానయాన సంస్థలను కూడా నడిపించలేదు" అన్నారు. కాగా, ప్రస్తుతం పౌరవిమానయాన శాఖ ఆధ్వర్యంలోని ఏఏఐ (ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా) అధీనంలో దాదాపు 100కు పైగా విమానాశ్రయాలు ఉన్నాయి. వీటన్నింటినీ దశలవారీగా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్నది కేంద్ర అభిమతం.

ఇక ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియపై మాట్లాడిన ఆయన, సమర్ధతగల కంపెనీల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నామని, ఈ సంవత్సరమే డీల్ కుదురుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా, గత మంగళవారం సమావేశమైన క్యాబినెట్, ఎయిర్ ఇండియాను అక్టోబర్ 30 నాటికి విక్రయించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ పాటికే ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావాల్సి వుంది. జనవరి 27న బిడ్లకు తుది గడువు పెట్టిన కేంద్రం, ఆపై నాలుగు సార్లు తుది గడువును పొడిగిస్తూ వచ్చింది.

ఇదిలావుండగా, ఈ సంవత్సరం చివరకు దేశవాళీ విమాన ప్రయాణికుల సంఖ్య, కరోనా ముందున్న స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని హర్ దీప్ సింగ్ అంచనా వేశారు. ప్రస్తుతం విమానాల కెపాసిటీలో 45 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే అధికారులు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇండియాలోని మేజర్ ఎయిర్ పోర్టులైన లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, గౌహతి, తిరువనంతపురం విమానాశ్రయాలను అదానీ ఎంటర్ ప్రైజస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Hardeep Singh
Airports
India
Privatisation

More Telugu News