Shashi Tharoor: ఆ లేఖకు బీజం పడింది శశిథరూర్ ఇంట్లోనేనట!

Seed of letter germinated at dinner hosted by Tharoor five months ago
  • ఐదు నెలల క్రితం థరూర్ ఇంట్లో విందు
  • నూతన అధ్యక్షుడు, పార్టీలో సంస్కరణలపై చర్చ
  • అంగీకరించిన కొందరు సీనియర్లు
కాంగ్రెస్‌ పార్టీలో పెను వివాదానికి కారణమైన లేఖకు సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఇంట్లోనే బీజం పడినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐదు నెలల క్రితం థరూర్ ఇంట్లో జరిగిన విందులోనే సోనియాకు లేఖ రాయాలని సీనియర్ నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీ అధినేత్రి సోనియాకు 23 మంది సీనియర్లు లేఖ రాశారు. అయితే, శశిథరూర్ ఇంట్లో పార్టీకి హాజరైన సీనియర్లలో చాలామంది ఆ లేఖపై సంతకం చేయనప్పటికీ విందుకు హాజరైన అందరూ ఆ లేఖకు గట్టి మద్దతు పలికారు.  

విందుకు హాజరైన వారిలో పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, సచిన్ పైలట్, అభిషేక్ మను సింఘ్వి, మణిశంకర్ అయ్యర్ తదితరులు ఉన్నారు. అయితే, వీరిలో కొందరు మాత్రం తాము పార్టీకి హాజరు కాలేదని చెబుతుండగా, సింఘ్వి మాత్రం శశిథరూర్ ఇంట్లో జరిగిన విందుకు హాజరైనట్టు తెలిపారు. విందుకు హాజరు కావాలంటూ థరూర్ తనను ఆహ్వానించడం నిజమేనని అంగీకరించారు. ఈ సందర్భంగా పార్టీ నూతన అధ్యక్షుడు, పార్టీలో సంస్కరణలపై అనధికారిక చర్చ జరగడం నిజమేనన్నారు. అయితే, లేఖకు సంబంధించిన సమాచారం మాత్రం తన వరకు రాలేదని స్పష్టం చేశారు.

మరో సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ.. సోనియాకు రాసిన లేఖపై సంతకం చేయాలని తననెవరూ అడగలేదని, తాను దానిపై సంతకం చేయలేదని అన్నారు. నూతన అధ్యక్షుడి ఎన్నిక, సంస్కరణలపై చర్చ నిజమేనని పేర్కొన్నారు. లేఖ రాసే విషయంలో విందులో పాల్గొన్న వారెవరూ వ్యతిరేకించలేదన్నారు. లేఖపై సంతకం చేసిన ఎంపీ ఒకరు మాట్లాడుతూ.. ఆ లేఖను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రాసింది కాదని, పార్టీలో సంస్కరణలను కోరుకుంటున్నాం కాబట్టే సంతకం చేశానని ఆయన పేర్కొన్నారు.
Shashi Tharoor
Congress
Letter
Sonia Gandhi
Rahul Gandhi

More Telugu News