SII: 73 రోజుల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ వస్తుందని మేం చెప్పలేదు: ఎస్ఐఐ

SII clarifies Covishield vaccine availability in India
  • ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ భారత్ లో ఉచితమంటూ ప్రచారం
  • స్పష్టత ఇచ్చిన ఎస్ఐఐ
  • తయారీ, నిల్వకు మాత్రమే అనుమతి లభించిందని వెల్లడి

కరోనా మహమ్మారికి కౌంట్ డౌన్ మొదలైందని, మరో 73 రోజుల్లో ఆక్స్ ఫర్డ్ వర్సిటీ-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంలో తయారైన కొవిషీల్డ్ వ్యాక్సిన్ భారత్ లో ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని ఈ ఉదయం మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, దీనిపై సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) స్పందించింది. భారత్ లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ పంపిణీ గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఎస్ఐఐ స్పష్టం చేసింది.

కొవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయితే, టీకా తయారీకి, నిల్వకు మాత్రమే తమకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని ఎస్ఐఐ వెల్లడించింది. ఇదంతా దశలవారీగా జరగాల్సిన ప్రక్రియ అని వివరించింది. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఎస్ఐఐ పేర్కొంది.

ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కొవిషీల్డ్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటోందని, ఈ వ్యాక్సిన్ వల్ల కలిగే రోగ నిరోధక శక్తి పటిమ ఏపాటిదో నిర్ధారించుకున్న తర్వాతే ఉత్పత్తి గురించి ప్రకటన చేస్తామని వివరించింది. ఏవైనా తాము అధికారికంగా ప్రకటించిన విషయాలు తప్ప ఇతర కథనాలను నమ్మవద్దని ఎస్ఐఐ తేల్చిచెప్పింది.

  • Loading...

More Telugu News