IT: 18 కోట్ల పాన్‌కార్డులకు మంగళం.. ఆధార్ అనుసంధానం చేయని ఫలితం!

IT department ready to defunct 18 crore Pan Cards
  • ఆధార్-పాన్ అనుసంధానానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువు
  • ఇంకా అనుసంధానం కాని 18 కోట్ల పాన్‌కార్డులు
  • కొందరి వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉన్నాయన్న ఐటీశాఖ
దేశంలో దాదాపు 18 కోట్ల పాన్‌కార్డులకు ప్రభుత్వం త్వరలో మంగళం పాడనుంది. పాన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానించాలంటూ ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా గడువును పలుమార్లు పొడిగించింది. అయినప్పటికీ చాలామంది ఇంకా తమ పాన్‌కార్డులకు ఆధార్ అనుసంధానించడం లేదు. తాజాగా, 31 మార్చి 2021 నాటికి అనుసంధానం చేసుకోవాలంటూ గడువును మరోమారు పొడిగించింది. ఆధార్‌కార్డుతో లింకు చేయని దాదాపు 18 కోట్ల పాన్‌కార్డులు ఉన్నాయని, గడువులోగా వాటిని ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఐటీ శాఖ తెలిపింది. అప్పటిలోగా వీటిని అనుసంధానించకపోతే వాటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తామని హెచ్చరించింది.

ఒకటి కన్నా ఎక్కువ పాన్‌కార్డులు కలిగిన వారిని, పన్ను ఎగవేతదారులను, అధిక మొత్తాల్లో లావాదేవీలు జరిపే వారిని గుర్తించే పనిలో ఉన్నట్టు ఐటీశాఖ తెలిపింది. కొందరు విలాసవంతంగా ఖర్చు చేస్తూ పన్నులు ఎగవేసేందుకు ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులను ఉపయోగిస్తున్నట్టు పేర్కొంది. పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానిస్తే ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు పొందే అవకాశం ఉండదని తెలిపింది. కాబట్టే పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించేందుకు వారు వెనకడుగు వేస్తున్నట్టు పేర్కొంది.
IT
Pan Cards
AAdhar cards
Linking

More Telugu News