Corona Virus: డేంజర్ బెల్స్: కరోనా వైరస్‌లో మరో కొత్తరకం గుర్తింపు.. పదిరెట్ల ఎక్కువ వేగం!

Malaysian visitor found infected after he returned home
  • ‘డి614జి’  అనే కొత్తరకం వైరస్‌ను గుర్తించిన మలేసియా శాస్త్రవేత్తలు
  • భారత్‌కు వచ్చిన వ్యాపారవేత్త ద్వారా సంక్రమించిన వైరస్
  • కరోనా కట్టడికి చేస్తున్న ప్రయత్నాలకు ఇది భంగం కలిగించే అవకాశం ఉందని ఆందోళన
కరోనాతో ఇక్కట్లు పడుతున్న ప్రపంచానికి మలేసియా శాస్త్రవేత్తలు మరో భయంగొల్పే వార్త చెప్పారు. ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనా వైరస్‌ కంటే 10 రెట్ల ఎక్కువ వేగంతో విస్తరించే కొత్త వైరస్‌ను గుర్తించినట్టు వెల్లడించారు. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషిని ఇది అడ్డుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కొత్త రకం వైరస్‌కు ‘డి614జి’ అని పేరుపెట్టారు. ప్రస్తుత కరోనా వైరస్ ఉత్పరివర్తన చెంది ఈ రూపాన్ని సంతరించుకున్నట్టు పేర్కొన్నారు.

భారతదేశం నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యాపారి క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి దాదాపు 45 మందికి వైరస్‌ను అంటించాడని, ఈ సందర్భంగానే కొత్త వైరస్ ఉత్పరివర్తనను గుర్తించినట్టు వివరించారు. వ్యాపారవేత్త ద్వారా కరోనా సోకిన వారిలో ముగ్గురికి ‘డి614జి’ రకం వైరస్ సోకినట్టు పేర్కొన్నారు. ఈ రకం వైరస్ ఇప్పటికే అమెరికా, ఐరోపాలలో కనిపించిందని, దీనివల్ల కరోనా మహమ్మారి రెండోసారి విజృంభించే అవకాశం ఉందని మలేసియా ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ నూర్ హిషామ్ పేర్కొన్నారు.

వైరస్‌లోని జన్యుపదార్థంలో జరిగే మార్పునే మ్యుటేషన్ (ఉత్పరివర్తన) గా పిలుస్తారు. ఈ మార్పులు మానవులపై అదనపు దుష్ప్రభావాలను చూపిస్తాయి. ఈ ఉత్పరివర్తనాల వల్ల కొన్ని సందర్భాల్లో వైరస్ బలహీనపడుతుంది కూడా. కరోనాకు కారణమయ్యే సార్స్-కోవ్-2 వంటి ఆర్ఎన్ఏ వైరస్‌లు చాలా వేగంగా మ్యుటేషన్ చెందుతుంటాయి. వివిధ దేశాల్లో కొన్ని భిన్న రకాల కరోనా వైరస్‌లు ఉండడం ఇందులో భాగమేనని మలేసియా శాస్త్రవేత్తలు వివరించారు.
Corona Virus
Malasia
mutation
D614G

More Telugu News