వాట్ నెక్ట్స్... ధోనీ ప్లాన్ ఏంటంటే..!
- శనివారం నాడు క్రికెట్ కు వీడ్కోలు
- ఐపీఎల్ లో మరో సీజన్లు కనిపించే అవకాశం
- తదుపరి ఆర్మీకి సేవ చేసే ఆలోచన
- ఆగిపోయిన చదువును కొనసాగించే అవకాశం
2008లో రాంచీలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో, ఆఫీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ కోర్సులో బ్యాచ్ లర్ డిగ్రీలో చేరిన ధోనీ, ఆరు సెమిస్టర్లలోనూ ఫెయిల్ అయ్యారు. దాన్ని పూర్తి చేయాలని ధోనీ ఆలోచనలో ఉన్నారట. పదో తరగతిలో 66 శాతం, ఇంటర్ లో 56 శాతం మార్కులు మాత్రమే సాధించానని గతంలో ధోనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. బోర్డు పరీక్షలను కూడా ఎగ్గొట్టి, క్రికెట్ ఆడేందుకు ధోనీ వెళ్లాడని కూడా అందరికీ తెలిసిందే.
క్రికెట్ లో రాణించిన తరువాత, నవంబర్ 2011లో ధోనీకి ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో గౌరవ ఉద్యోగం లభించింది. ఇప్పటికే ధోనీ పలుమార్లు సైనిక కార్యకలాపాల్లోనూ పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇవే బాధ్యతలను నెరవేర్చేందుకు తాను సిద్ధంగా ఉంటానని కూడా ధోనీ వ్యాఖ్యానించారు. ఆర్మీలో పనిచేయాలన్నది తన కలని, దాన్ని నెరవేర్చుకుంటానని ఓ ఇంటర్వ్యూలోనూ ఆయన చెప్పారు. ఆర్మీలో చేరాలని చిన్నప్పుడే కోరుకున్నానని, ఆ తరువాత క్రికెట్ లో రాణించానని తెలిపారు. దీంతో ఆయన ఆర్మీ విధుల ద్వారా దేశానికి సేవ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.