Ram: ఈ హీరో రామ్ ఎవరో మాకు తెలియదు: బెజవాడ ఏసీపీ

Vijayawada Police says the do not know who is Ram
  • స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ట్వీట్లు చేసిన హీరో రామ్
  • రామ్ చేసిన ట్వీట్లపై వివరణ ఇచ్చిన పోలీసులు
  • రమేశ్ బాబు పరారీలోనే ఉన్నారని స్పష్టీకరణ
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ వ్యవహారంలో హీరో రామ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి  విజయవాడ పోలీసులు ఆసక్తి చూపలేదు. హీరో రామ్ చేసిన వ్యాఖ్యలపై ఏమంటారు? అంటూ మీడియా ప్రశ్నించగా, ఆయన ఎవరో తమకు తెలియదని ఏసీపీ అన్నారు. అయితే రామ్ చేసిన ట్వీట్ల గురించి వివరణ ఇస్తూ, కొవిడ్ కేర్ సెంటర్ కు, క్వారంటైన్ కేంద్రానికి చాలా తేడా ఉందని స్పష్టం చేశారు.

విదేశాల నుంచి వచ్చిన వారిని టెస్టు చేసే వరకు వారిని వివిధ హోటళ్లలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతామని, స్వర్ణ ప్యాలెస్ లోనూ మొదట్లో క్వారంటైన్ కేంద్రం నిర్వహించినట్టు తెలిపారు. విదేశాల నుంచి వచ్చేవారు ఇలాంటి క్వారంటైన్ కేంద్రాల్లో బస చేసినందుకు కొంత మొత్తం చెల్లిస్తారని, కరోనా టెస్టులు పూర్తయిన తర్వాత వారు వెళ్లిపోతారని ఏసీపీ స్పష్టం చేశారు.

అంతకుముందు రామ్ ట్విట్టర్ లో స్పందిస్తూ, స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహించకముందే ఏపీ ప్రభుత్వం అందులో క్వారంటైన్ కేంద్రం నిర్వహించిందని, ఆ సమయంలో అగ్నిప్రమాదం జరిగివుంటే ప్రభుత్వాన్ని నిందించేవాళ్లా అంటూ ప్రశ్నించారు. కాగా, ఈ వ్యవహారంలో కేంద్ర బిందువుగా ఉన్న రమేశ్ ఆసుపత్రి ఎండీ రమేశ్ బాబు... హీరో రామ్ కు బాబాయే!

అటు, విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది కరోనా బాధితులు మరణించిన ఘటనలో నిందితుడు రమేశ్ ఆసుపత్రి యజమాని రమేశ్ బాబు కోసం పోలీసుల వేట సాగుతోంది. రమేశ్ బాబు కోసం తాము ఆయన నివాసంలోనూ, ఆసుపత్రిలోనూ సోదాలు జరిపామని, ఆయన ఎక్కడా కనిపించలేదని పోలీసులు స్పష్టం చేశారు. రమేశ్ బాబు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. న్యాయవాదుల సూచనల మేరకు ఫోన్ స్విచాఫ్ చేశానని రమేశ్ బాబు చెబుతున్నా, ఆయన అందుబాటులో లేనందున పరారీలో ఉన్నట్టుగానే భావిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.
Ram
Police
Vijayawada
Swarna Palace Hotel
Ramesh Hospitals
Ramesh Chowdary

More Telugu News