Dhavaleswaram: ధవళేశ్వరం వద్ద ప్రమాదకర స్థితికి చేరుకున్న గోదావరి

Godavari river drained with flood water at Dhavaleswaram
  • ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు
  • వరద రూపు దాల్చిన గోదావరి
  • జలదిగ్బంధనంలో పలు గ్రామాలు
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతి తీవ్రమైంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడక్కడ ఔట్ ఫ్లో 9.84 లక్షల క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. గోదావరి ప్రవాహ తీవ్రత అంతకంతకు అధికమవుతుండడంతో నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధం తెగిపోయింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలోని చాకలిపాలెం కాజ్ వే మునిగిపోవడంతో సమీప లంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాగా, ఎగువన ఇప్పటికే భద్రాచలం వద్ద  మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. ప్రస్తుతం అక్కడ 45 అడుగులు ఉన్న నీటిమట్టం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Dhavaleswaram
Godavari
Water
Flood
Rains

More Telugu News