Chandrababu: అందుకే నా మీద కుల ముద్ర వేశారు: చంద్రబాబు
- వైసీపీకి అభివృద్ధి చేయడం రాదు
- నా పోరాటం స్వార్థం కోసం కాదు
- మూడు ముక్కలాట ఆడుతామంటే కుదరదు
ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతలంతా మాట మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం వైసీపీ నేతల నైజమని అన్నారు. వైసీపీ నేతలకు భజన చేయడం మాత్రమే వచ్చని, అభివృద్ధి చేయడం రాదని చెప్పారు. టీడీపీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, రాష్ట్ర విభజన జరిగిన అభివృద్ధిపై ఈరోజు ఆయన ఆన్ లైన్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి గురించి గతంలో వైసీపీ నేతలు మాట్లాడిన వీడియోలను చూపించారు.
సామాజిక న్యాయం కోసం పోరాడిన చరిత్ర తనదని చంద్రబాబు అన్నారు. అమరావతి రాష్ట్ర ప్రజలందరి కోసమని, తన స్వార్థం కోసం కాదని చెప్పారు. ప్రజలంతా ఇప్పుడే పోరాడాలని... లేకపోతే తీవ్రంగా నష్టపోతామని అన్నారు. తనను ఏమీ చేయలేకే... వైసీపీ నేతలు తనపై కుల ముద్ర వేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ప్రధానమని చెప్పారు. కరోనా గురించి తాను మాట్లాడితే విమర్శించారని... ఇప్పుడు కరోనా కేసుల పెరుగుదలలో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో ఉందని తెలిపారు. మూడు ముక్కలాట ఆడుతామంటే కుదరదని... అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని చెప్పారు.